ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో కళాకారులకు సాంప్రదాయ నృత్యరీతులైన కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, భరతనాట్యం, గాత్ర (సింగింగ్), జానపద కళారూపాలైన డప్పులు, గరగలు, తప్పెటగుళ్లు, కోలాటం, చెక్క భజన, పులి వేషాలు, బుట్టబొమ్మలు, కాళికా వేషాలు, ఉరుములు మరియు గిరిజన కళారూపాలైన ధింసా, కొమ్ముకోయ, సవర, లంబాడీ తదితర విభాగాలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జున రావు ఒక ప్రకటనలో తెలిపారు.
జోనల్ స్థాయి పోటీలు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, సత్యసాయి, అనంతపురము, నంద్యాల, కర్నూలు జిల్లాల కళాకారులకు నవంబర్ 19, 20, 21 తేదీలలో తిరుపతిలో మహతి కళాక్షేత్రం నందు నిర్వహిస్తామన్నారు. ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, యన్.టి.ఆర్., కృష్ణ జిల్లాల కళాకారులకు నవంబర్ 24, 25, 26 తేదిలలో గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తామన్నారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కళాకారులకు నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో రాజమహేంద్రవరంలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కళాకారులకు డిసెంబర్ 7, 8, 9 తేదిలలో విశాఖపట్నంలో వుడా చిల్డ్రన్స్ థియేటర్లో పోటీలు నిర్వహింపబడతాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు విజయవాడలో డిసెంబర్ 19, 20 తేదిలలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఆసక్తి గల కళాకారులు దరఖాస్తులను నవంబర్ 10వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయం, విజయవాడ నందు లేదా విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు/పాఠశాలల నందు స్వయంగా సమర్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి వెబ్ సైటులో దరఖాస్తును పూర్తిచేయవచ్చని ఆయన తెలిపారు. జోనల్ స్థాయి పోటీల్లో సోలో మరియు బృంద విభాగములో ప్రథమ విజేతలకు రూ.10,000, రూ. 25,000 నగదు బహుమతులు అందజేస్తారన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో పోటిల్లో సోలో బృంద విభాగములో ప్రథమ విజేతలకు రూ.50,000, 1,00,000నగదు బహుమతులను అందజేస్తారని ఆయన తెలిపారు. 15 నుండి 20 సంవత్సరాల వయసు గల జూనియర్స్ విభాగానికి 6 నుండి 8 నిమిషాలు, 20 నుండి 40 సంవత్సరాల వయసు గల సీనియర్స్ విభాగానికి 8 నుండి 10 నిమిషాలు ప్రదర్శన సమయం ఇవ్వబడుతుందని మల్లిఖార్జున రావు తెలిపారు.