14.9 లక్షల పాఠశాలలు, వివిధ సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన సుమారు 26.5 కోట్ల విద్యార్థులు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారత విద్యా వ్యవస్థకు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థగా పేరుంది. విభిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులున్న మన దేశంలో విద్యా రంగంలో ఉన్నతమైన ప్రమాణాలు సాధించడం, అందరికీ ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి వీలైన ప్రణాళికలను రూపొందించడం వంటి లక్ష్యాలతో కేంద్రం ప్రతి ఏటా ఈ పెర్ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సులను ప్రకటిస్తోంది. దీనికోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని విద్యా రంగ పరిస్థితులను పరిశీలించి ఈ పీజీఐ స్థాయిలను నిర్ణయిస్తోంది. 1000 పాయింట్ల పీజీఐలో ఆయా రాష్ట్రాలు సాధించిన అభ్యసన ఫలితాలు, పాఠశాలల అందుబాటు, పాఠశాలల్లో ప్రాధమిక సదుపాయాల కల్పన, అందరికీ సమాన విద్య అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయిస్తుంది. వాటి ఆధారంగా ఆయా రాష్ట్రాల స్థాయిలను ప్రకటిస్తుంది.