విద్యా రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తోంది. ఆ రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చేరింది. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేనాటికి విద్యారంగంలో లెవల్-6లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ కృషితో రెండేళ్లకే ఏకంగా లెవల్-2కు చేరుకోవడం గర్వకారణం. ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి జగన్ భాగస్వామ్యం చేశారు. నాడు- నేడు పేరుతో స్కూళ్ల రూపురేఖలు మార్చారు. విద్యార్థుల పుస్తకాలు, భోజనం, స్కూలు బ్యాగులు, షూ, యూనిఫారాలు.. ఇలా అన్నింటిలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లలో సైతం కొన్నింటిలో మాత్రమే అందుబాటులో ఉన్న ఎడ్యుటెక్ విద్యను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ జగన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ద్విభాషా పాఠ్యపుస్తకాలను పరిచయం చేస్తూ తీసుకున్న చర్యలతో పాఠశాల విద్యలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2020-21కి గాను విద్యారంగంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కనబరిచిన పనితీరుకు సంబంధించిన ఫలితాల గ్రేడింగ్‌ను (పీజీఐ) కేంద్ర విద్యా శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లెవెల్-2లో నిలిచింది. వివిధ అంశాల వారీగా 1000 పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ఆయా రాష్ట్రాలకు లెవెల్ స్థాయిలను ప్రకటిస్తుంటుంది. ఇందులో 901 నుంచి 950 మధ్య పాయింట్లను సాధించిన రాష్ట్రాలు లెవెల్ 2లో నిలుస్తాయి. 2017-18, 2018-19 సంవత్సరాల్లో వరసగా లెవల్-6కు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని అగ్ర రాష్ట్రాల సరసన లెవల్-2లో నిలవటం గొప్ప విశేషం.