విజయవాడ : స్వాతంత్ర్య
సమర యోధుల రూపచిత్రాల సమాహారంగా “స్వాతంత్ర్య స్పూర్తి – తెలుగు దీప్తి” పేరిట పుస్తకం రూపుదిద్దుకోవటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల నేపధ్యంలో శుక్రవారం రాజ్ భవన్ వేదికగా ఈ సంకలనాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 133 మంది పోరాట యోధుల చిత్రపటాలు, సంక్షిప్త సమాచారంతో ఈ పుస్తకాన్ని తీసుకురావటం అభినందనీయమన్నారు. నేటి బాలలు, యువతలో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించేలా ఈ తరహా గ్రంధాలు మరిన్ని రూపుదిద్దుకోవాలన్నారు. ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా, గిల్డ్ అధ్యక్షుడు డాక్టర్ బిఎ రెడ్డిని గవర్నర్ అభినందించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, గిల్డ్ ఉపాధ్యక్షుడు సుభాష్ బాబు, కన్వీనర్ రమేష్, ఆర్టిస్ట్ అప్పారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.