మునుగోడు : తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన మునుగోడు మహిళలు, యువత తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. చివర్లో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడంతో సమయం ముగిసినా వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఫలితంగా పలు కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. సుమారు 86శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదు కాగా పోలింగ్ గడువు ముగిసే సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం మరింతగా పెరిగింది. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత మునుగోడు ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని తేల్చేశాయి. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో అధికార టీఆర్ఎస్ 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని తేలింది. అదే సమయంలో బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 23 శాతం ఓట్లు, బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇక త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో అధికార టీఆర్ఎస్ కు ఏకంగా 47 శాతం ఓట్లు రాగా బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు రానున్నట్లు తేలింది.