ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యూహం మార్చారా? పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తారా? వికేంద్రీకరణ నినాదం మరింత జోరందుకుంటుందా? అదే నినాదంతో ఆయన ఎన్నికలకు వెళతారా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ఇప్పుడు పరిశీలకుల మెదళ్లను తొలుస్తున్నాయి. అవును. మూడు రాజధానుల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతోంది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ఆలస్యంగానైనా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణ నుంచి సీజేఐ యుయు లలిత్ తప్పుకున్నారు. కొత్త ధర్మాసనానికి ఈ కేసు బదిలీ కానుంది. అయితే ఈలోగానే కొత్త ఆలోచనలతో సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. న్యాయపరంగా ఈ వ్యవహారం ఎలా ఉన్నా.. తాను అనుకున్న విధంగా విశాఖ నుంచి పాలన చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందు కోసం ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎంగా తాను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని తాజాగా సీఎం స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉంటే అక్కడే మంత్రులు ఉంటారని, సచివాలయం కూడా అక్కడే ఉంటుందని చెప్పుకొచ్చారు. త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని మరో వైపు మంత్రులు కూడా చెబుతున్నారు. దీన్నిబట్టి కొత్త ఫార్ములా అమలు చేసేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నట్లు భావిస్తున్నారు. ఇందు కోసం సంక్రాంతిని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి పాలనకు సీఎం సిద్దమవుతున్నారనే చర్చ మొదలైంది కూడా.
సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చనే అంశం పైనా, సచివాలయం కూడా సీఎం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందనే వ్యాఖ్యల పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పు నేపధ్యంలో ఒక్క అంగుళం కూడా కదల్లేరని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి ఈ సారి పట్టుదలతో ఉన్నారు. మరో వైపు ఉత్తరాంధ్ర మంత్రులు తమ ప్రాంతానికి పరిపాలనా రాజధాని వస్తుంటే టీడీపీ అడ్డుకుంతొందనే ఆరోపణలు మొదలు పెట్టారు. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఏకంగా రాజీనామాకు ముందుకొచ్చారు. అటు కర్నూలులోనూ న్యాయ రాజధాని..(హైకోర్టు ఏర్పాటు) డిమాండ్ ఊపందుకుంటోంది.
అమరావతే రాజధాని అంటూ తాము తీర్పు ఇచ్చిన తరువాత, సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి చూడకుండా ఈ ఆందోళనలు ఏంటంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో ఏపీ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ భేటీలో సీఎం జగన్ తన ఆలోచనలను..నిర్ణయాలను సహచర మంత్రులతో పంచుకునే అవకాశం ఉంది. అదే సమయంలో మంత్రులకు దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం అమలు తీరు ఎలా ఉంటుంది అనేది ఆసక్తి కరంగా మారింది. ముఖ్యమంత్రి ఇచ్చే స్పష్టత కోసం అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. సేవ్ విశాఖ పేరుతో టీడీపీ అందోళనలకు పిలుపునిస్తున్న నేపధ్యంలో విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు అంశం ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సి వుంది.