అనంతపురం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గాలను, జగన్ రెడ్డి అవినీతిని ఎండగడుతున్నారన్న అక్కసుతోనే అయ్యన్నపై పాలకులు కక్షగట్టారని ఆరోపించారు. అన్యాయంగా గతంలో ఇంటి ప్రహరిని కూల్చేసిన పోలీసులు ఈరోజు ఆయన కుమారుడు రాజేష్తోపాటు అయ్యన్నను రాత్రి వేళ బలవంతంగా తీసుకెళ్లడం చట్టవ్యతిరేకమన్నారు. పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి ఇళ్లలో ప్రవేశించడం ముఠానేత జగన్ పాలనలోనే చూస్తున్నామన్నారు. ఇలాంటి తప్పుడు పనులు మానుకోకుంటే జగన్ రెడ్డిని ప్రజలే తరిమికొట్టే రోజు దగ్గరలోనే వస్తుందని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు.