అమరావతి : అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో పంట కోత పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతంతో మరణించడం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఈ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు నిర్దేశించారు. కూలీలు పంట కోస్తుండగా వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో 33 కేవీ విద్యుత్ మెయిన్ లైను తెగి వారిపై పడడంతో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కాగా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఘటనకు బాధ్యులుగా భావించి ఏడీఈ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్లపై వేటు వేసింది. దర్గాహొన్నూరు ఘటనపై అన్ని వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్ ను ఆదేశించింది.