అనకాపల్లి : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. చింతకాయల రాజేశ్‌ను కూడా అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇచ్చి ఆయనను అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని సీఐడీ పోలీసులు తెలిపారు. అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటి గోడలు దూకి లోనికి ప్రవేశించారు. అర్ధరాత్రి అయ్యన్నఇంట్లోకి పోలీసుల ప్రవేశంపై స్థానికులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులు కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి ఫోన్లు తీసుకున్నారు.తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందన్న అయ్యన్న భార్య పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని మండిపడ్డారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వకుండా తీసుకెళ్లారన్నారు. 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అయ్యన్న అరెస్టును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు.