డేరా బాబాగా పేరు పొందిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బుధవారం వర్చువల్ ‘సత్సంగ్’ కార్యక్రమాన్ని నిర్వహించాడు. హర్యానాలోని కర్నాల్ మేయర్, అధికార బీజేపీకి చెందిన పలువురు నాయకులు, ముఖ్య అతిథుల నడుమ ఆయన సత్సంగ్ కార్యక్రమం జరిగింది. 2017లో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్‌కు అతని కుటుంబం దాఖలు చేసిన దరఖాస్తు మేరకు గత వారం 40 రోజుల పెరోల్ మంజూరైంది. అతను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ నుండి సత్సంగాన్ని నిర్వహించాడు.
అంతకుముందు, డేరా చీఫ్ జూన్‌లో నెల రోజుల పెరోల్‌పై జైలు నుండి బయటకు వచ్చారు. హర్యానాలో వచ్చే నెలలో జరగనున్న ఉపఎన్నికలతో పాటు పంచాయితీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రభావవంతమైన ఆధ్యాత్మిక నాయకుడికి పెరోల్ మంజూరైనట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో రామ్ రహీమ్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొనడంపై ప్రతిపక్షం మరింతగా విమర్శలు గుప్పిస్తోంది.
ఈ సమావేశానికి హాజరైన బీజేపీ నాయకులలో కర్నాల్ మేయర్ రేణు బాల గుప్తా, డిప్యూటీ మేయర్ నవీన్ కుమార్, సీనియర్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగ్గి, ఎన్నకల్లో పాల్గొనబోయే అభ్యర్థులతో పాటు ఇతర బీజేపీ ముఖ్యులు ఉన్నట్లు సమాచారం. హర్యానాలో నవంబర్ 3న అడంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు కూడా నవంబర్ 9, 12 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డేరా బాబా సత్సంగ్ నిర్వహణ హర్యానాలో చర్చనీయాశంగా మారింది.
మూలం: ఎన్.డి.టీ.వీ.