రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత విలాసవంతమైన ఖరీదైన భారీ భవనానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ భవంతి ధర దాదాపు రూ.1,349.60 కోట్లు (163 మిలియన్ డాలర్లు) అని అంచనా. ఇది దుబాయ్‌లోని పామ్ జుమెయిరా దీవిలో ఉంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం ఈ వివరాలను వెల్లడించింది. కువైటీ వ్యాపారవేత్త మహమ్మద్ అల్షయా నుంచి అంబానీ ఈ భవంతిని గత వారం కొన్నారు.
స్టార్‌బక్స్, హెచ్ అండ్ ఎం, విక్టోరియాస్ సీక్రెట్ వంటి రిటెయిల్ బ్రాండ్స్‌కు లోకల్ ఫ్రాంచైజీలు మహమ్మద్‌కు ఉన్నాయి. ప్రస్తుతం ముకేశ్ అంబానీ మన దేశ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద నికర విలువ 84 బిలియన్ డాలర్లు. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం 80 మిలియన్ డాలర్లతో ఓ ఇంటిని ఈ ఏడాదిలో కొన్నారు. దీనిలో 10 పడక గదులు ఉన్నాయి. ఓ ప్రైవేట్ స్పా, ఇండోర్ పూల్, ఔట్‌డోర్ పూల్ ఉన్నాయి. దీనిని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. దుబాయ్‌లో తాజాగా ఓ భవంతిని ముకేశ్ అంబానీ సొంతం చేసుకోవడంతో అక్కడ ఆయన సామ్రాజ్యం విస్తరిస్తోందని చెప్పవచ్చు.
దీని విలువ 163 మిలియన్ డాలర్లు అని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించింది, కానీ కొనుగోలుదారు వివరాలను వెల్లడించలేదు. గత సంవత్సరం సుప్రసిద్ధ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్‌ను 79 మిలియన్ డాలర్లతో రియలన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలను దుబాయ్ ఆకర్షిస్తోంది. యూఏఈ జనాభాలో 80 శాతం మంది విదేశీయులే. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వీరే ప్రధానం. దుబాయ్ రియల్ ఎస్టేట్ టాప్ బయ్యర్స్‌లో భారతీయులదే అగ్రస్థానం. యూఏఈలో రియల్ ఎస్టేట్ ధరలు గత సంవత్సరం కన్నా 70 శాతానికి పైగా పెరిగాయి.
మూలం: అవుట్ లుక్