విలవిల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలను కూడా వైరస్ పట్టి పీడిస్తోంది.
మొత్తంమీద ఆ దేశంలో సరిపడినంతగా టెస్టులు లేవు. కావల్సినన్ని మందులు లేవు.
ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. చివరికి శ్మశనాల్లోనూ క్యూలు. జీరో కోవిడ్
విధానాన్ని ఎత్తేసిన చైనా ఇప్పుడు చూస్తున్నది శాంపిలేనని..పెను విధ్వంసం
పొంచి ఉందని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు తీవ్ర భయాందోళనలు
కలిగిస్తున్నాయి.
హైరౌ శ్మశానవాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి మూడు రోజుల
పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చైనాలో కరోనా విధ్వంసానికి ఇదో ఉదాహరణ. ఇది
ఊహించిందే అయినప్పటికీ ఈ పరిస్థితులు ఎదుర్కోవడం చైనాకు సవాల్‌గా మారింది.
జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా గత నెల చివరి వారానికి ఆ దేశమంతటా నిరసనలు
తీవ్ర రూపం దాల్చాయి. ఫలితంగా కరోనా కఠిన నియమావళిని ఎత్తేయక తప్పలేదు. దీంతో
వైరస్ విజృంభణ మొదలయింది. 15 రోజుల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. అసలు
కరోనా ఎంతమందికి సోకిందన్నది కచ్చితమైన లెక్కలు తేలడం లేదు. కోవిడ్ మందులకు
కొరత ఏర్పడుతోంది. ఆస్పత్రులు, మెడికల్ షాపులు కిటకిటలాడుతున్నాయి.
చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా అన్ని
వేరియంట్లలోనూ ఇదే అన్నింటికన్నా వేగంగా వ్యాప్తిచెందేది. ఓ వ్యక్తికి వైరస్
సోకిందని తెలుసుకునే లోపే..వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు
కూడా వ్యాపిస్తోంది. దీంతో చైనాలోని చాలా నగరాల్లో కుటుంబాలకు కుటుంబాలు కరోనా
బారిన పడుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. శ్మశానవాటిక
సిబ్బందికి సైతం కరోనా సోకడంతో..అక్కడ విధి నిర్వహణ కష్టంగా మారుతోంది.
దీంతో తిరిగి ఆంక్షల దిశగా ఆ దేశం అడుగులేస్తోంది. వాణిజ్య నగరం షాంఘైలో
ఇప్పటికే ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. చాలా
స్కూళ్లలో టీచర్లు, స్కూల్ సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. నర్సరీలు, డే
కేర్ సెంటర్లు మూసివేస్తున్నారు. పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా చికిత్స
సదుపాయాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా తాత్కాలిక
ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. షాంఘైలో అదనంగా
2లక్షల 30వేల అదనపు బెడ్లు సమకూర్చారు.
మరోవైపు కరోనా వ్యాప్తిపై వైద్యనిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన
కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో చైనాలో కరోనా విస్ఫోటనం
చూస్తామని…అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్
హెచ్చరించింది. ఇప్పటికన్నా 2023లో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంటుందని, చైనా
ప్రజల్లో మూడోవంతుమంది వైరస్ బారిన పడనున్నారని అంచనా వేసింది. ఏప్రిల్ ఒకటి
నాటికి వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతుందని తెలిపింది. పదిలక్షలమంది
కరోనాతో చనిపోయే ప్రమాదముందని వెల్లడించింది. చైనాలో మరికొన్ని
సంస్థలు..జనవరిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాయి. 60శాతం
జనాభాకు వైరస్ సోకుతుందని, వృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని అంచనావేశాయి.
అతి ఎక్కువ జనాభా ఉన్న చైనా..ఆ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేయలేదు.
జీరో కోవిడ్ విధానం రూపొందించింది కానీ..ప్రజలకు కరోనా నుంచి రక్షణ కల్పించే
వ్యాక్సిన్లపై దృష్టిపెట్టలేదు. అసలు చైనా వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను ఏమీ
చేయలేకపోతున్నాయి. షాంఘైలోని ఫుడాన్ యూనివర్శిటీ అంచనాలు మరింత భయానకంగా
ఉన్నాయి. 15లక్షల 50వేలమంది కరోనాతో మరణించే ప్రమాదముందని, ఇంటెన్సివ్ కేర్
యూనిట్లకు ఇప్పుడున్న వాటి కన్నా 15.6 రెట్లు ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని
తెలిపాయి. 80 ఏళ్లు పైబడినవారిలో వ్యాక్సిన్ వేయించుకోని 80లక్షల మంది ప్రజలకు
రిస్క్ ఎక్కువగా ఉందని, షుగర్ పేషెంట్లూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని
పరిశోధకులు హెచ్చరించారు.
మూడేళ్లగా ఆంక్షల మధ్య గడిపిన ప్రజలు కరోనా నిబంధనల ఎత్తివేతతో దేశమంతా
స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంతే స్వేచ్ఛగా కరోనా వ్యాపిస్తోంది. చైనా కొత్త
సంవత్సరం వేడుకలు జరిగే జనవరి చివరి వారం నాటికి కేసులు భారీగా నమోదవుతాయన్న
ఆందోళన వ్యకమవుతోంది. గ్రామాలకు వెళ్లే చైనీయులు మాస్క్, భౌతిక దూరం వంటి
నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జీరో కోవిడ్ విధానంతో చైనాకు
ఇప్పటివరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదు. దీనికి తోడు కావల్సినన్ని వ్యాక్సిన్లు
అందుబాటులో లేవు. దీంతో కరోనా విస్ఫోటనంగా మారుతోంది. ఇది బద్ధలు
కాకముందే…కేసుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది .
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి?
ఇప్పటికే చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాప్తి చెందడంతో
భయాందోళనలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లోని
చిన్నచిన్నక్లినిక్ లు, నర్సింగ్‌హోమ్‌లు ఇప్పటికే కోవిడ్ లక్షణాలతో కూడిన
రోగులతో నిండిపోయాయి.
రాబోయే వారాల్లో గ్రామీణ చైనాలో నివసిస్తున్న 500 మిలియన్లకు పైగా ప్రజలు
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల తరంగాన్ని ఎదుర్కొంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే మిలియన్ల మంది వలస కార్మికులు నూతన సంవత్సరం కోసం వారి స్వగ్రామాలకు
తిరిగి వచ్చారు. పైగా, ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రయాణ ఆంక్షలను కూడా
ఉపసంహరించుకుంది.
ఇప్పటికీ మెజారిటీ జనాభాను వ్యాక్సినేషన్ చేరుకోలేకపోయింది. పరిమిత
వైద్య వనరులతో ఆ దేశం పెద్ద భూభాగంలో విస్తరించింది. ఓమిక్రాన్-ఆధారిత
మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడంతో గ్రామీణ చైనాపై తీవ్ర ప్రభావం చూపింది.
వైద్య వ్యవస్థ బలహీనంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కేసుల పెరుగుదల
ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ టాబ్లాయిడ్ ఈ వారం
నివేదించింది. మందులు, వైద్య సిబ్బంది కొరత.. వారు ఎదుర్కొంటున్న ప్రధాన
సమస్యలని నివేదించింది.
“కౌంటీ-స్థాయి వైద్య వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. గ్రామీణ వైద్య వ్యవస్థ
‘డబుల్ దెబ్బ’ ఎదుర్కొనే అవకాశం ఉన్నందున బాహ్య మద్దతు లెక్కించడం అసాధ్యం”
అని వుహాన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ సోషియాలజీ ప్రొఫెసర్ డెవెన్ ఈ వారం
ప్రారంభంలో చైనా ట్విట్టర్ లాంటి Weibo ప్లాట్‌ఫారమ్ లో రాశారు.