రైతులకు సంపూర్ణ భూహక్కులు..
దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్నరెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు
సంపూర్ణ భూహక్కులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం కింద సర్వే పూర్తయిన గ్రామాల
రైతులకు బుధవారం సిఎం జగన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భూమి హక్కు పత్రాలు
పంపిణీ చేశారు.
ఎన్నో ఏళ్ళుగా చెదలు పట్టిన భూరికార్డులు, ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని
పరిస్థితి.. ఇలాంటి స్థితిలో అడ్డూ అదుపూలేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన
చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులు భూవివాదాల నుంచి
బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం భూ స్వచ్ఛీకరణకు 2020 డిసెంబర్ 21న తక్కెళ్లపాడు
గ్రామంలో సీఎం చేతుల మీదుగా సరిహద్దు రాయి పాతి రీ సర్వే పథనికి శ్రీకారం
చుట్టింది. సర్వే తర్వాత ప్రతి రైతుకూ హద్దులు నిర్ణయించడంతోపాటు రాళ్లను పాతి
ప్రత్యేక నంబర్లు కేటాయిస్తుంది.
1904 తర్వాత..
ఆంగ్లేయుల పాలనలో 1904లో చివరి సారిగా పూర్తి స్థాయిలో భూ సర్వే జరిపి
రికార్డులను పొందుపరిచారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి సర్వే అండ్ రీ
సెటిల్మెంట్ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో భూముల
రీసర్వే చేయలేదు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టేలా రికార్డుల
స్వచ్ఛీకరణతోపాటు భూ రీసర్వేకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో
దశాబ్దాలుగా ఉన్న భూ చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. దీనివల్ల
రాష్ట్రంలో ఉన్న ఎందరో రైతులు, సామాన్య ప్రజల భూములను ఆక్రమంగా కబ్జా చేసి
ఆక్రమించుకుంటున్న వారికి ఈ భూసర్వే ద్వారా చెక్ పెట్టే అధికారం రాష్ట్ర
ప్రభుత్వానికి కలగనుంది.
డ్రోన్ల ద్వారా సర్వే రాళ్లతో హద్దులు..
సర్వే చేపడుతున్నగ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రికార్డులను
ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మొదటగా డ్రోన్
కెమెరాలతో పాయింట్లను గుర్తిస్తున్నారు. ఆ పాయింట్లు, రోవర్ ఆధారంగా
పొలాల్లోకి దిగి మాన్యువల్ గా సర్వే చేపడుతున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు
హద్దులు గుర్తించి రాళ్లు పాతుతున్నారు. జిల్లాలో ల్యాండ్ అండ్ సర్వే
అధికారులతోపాటు రెవెన్యూ అధికారుల సమన్వయంతో సర్వే ప్రక్రియ చేపడుతున్నారు.
ప్రతి గ్రామానికీ ఓ సర్వేయర్, ముగ్గురు డెప్యూటీ సర్వేయర్లు పనిచేస్తున్నారు.
పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ..
వందేళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో భూముల రీ సర్వే జరుగుతోంది. ఎవరు సాగు
చేస్తున్నారు, హద్దులేంటి, ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న విషయాలను సమగ్రంగా
పరిశీలించి రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నారు. పూర్తి పాదర్శకంగా, వివాదాలు
పరిష్కారమయ్యేలా సర్వే జరుగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో భూసర్వే
పూర్తికావడానికి 3, 4 నెలలు పడుతోంది. సర్వే పూర్తయిన గ్రామాల్లో క్యూఆర్
కోడ్ కలిగిన భూహక్కు పత్రాలు, మ్యాప్‌లను రైతులకు అందజేయనున్నారు.
ప్రజల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని గతంలో సీఎం జగన్ వెల్లడించారు.
ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట
పరిహారం అందిస్తుందని, అవినీతికి తావు లేకుండా భూముల లావాదేవీలన్నీఇకపై
గ్రామాల్లోనే జరుగబోతున్నాయని సిఎం జగన్ అప్పట్లో ప్రకటించారు.
రాష్ట్రం మొత్తం మీద భూముల సర్వే నిర్వహించడం వల్ల ప్రభుత్వ భూములతో పాటు
దేవాదాయ భూములు, ప్రైవేట్ భూములను కచ్చితంగా గుర్తించే అవకాశం కలుగుతుంది. ఇది
పూర్తయితే, వచ్చే 20 సంవత్సరాల వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా భూ సర్వే లెక్కల
పక్కా సమాచారం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంటుంది. వీటివల్ల ఎన్నో కబ్జాలను,
ఆక్రమణలను నిరోధించి ప్రభుత్వ భూములను, ప్రజల భూములను పరిరక్షించే
అవకాశం దక్కుతుంది. ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతున్న భూ వివాదాల కేసులు కూడా
ఒక కొలిక్కి రావచ్చు. దీని వల్ల రాష్ట్రంలో ప్రజల భూసమస్యలు పరిస్కారమై వారి
మొహల్లో ఆనందంతో కూడిన చిరు నవ్వులను చూడవచ్చు.