మూడు నాలుగు సెంటీమీటర్ల పొడవుతో సూదిలా సాధనం
మోచేతి చర్మం కింద పైపొరలో అమరిక
గర్భాన్ని నిరోధించే హార్మోన్ విడుదల
అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయనున్న కేంద్రం
బిడ్డల మధ్య ఎడం కోరుకునే వారికి ఉపయుక్తం
సంతానం కావాలనుకున్నప్పుడు ఈజీగా తొలగించొచ్చు
న్యూ ఢిల్లీ : గర్భ నిరోధానికి ఇప్పటి వరకు ఉన్న పిల్స్, ఇంజెక్షన్లు,
కాపర్-టి, కండోమ్‌ల వంటి సాధనాల స్థానంలో కొత్త పద్ధతి వస్తోంది. దీనిని
తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ
కొత్త సాధనం 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది.
దీనిని మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీంట్లో నుంచి గర్భాన్ని
నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికీ సాధనం హార్మోన్‌తోనే
తయారవుతుంది. సంతానం మధ్య దూరం ఉండాలని కోరుకునే వారు ఈ సాధనాన్ని
ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని
వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్
ఇంప్లాంట్’గా పిలుస్తున్నారు. ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా
పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ
అందుబాటులోకి తీసుకొస్తారు. స్టాఫ్ నర్సులు కూడా దీనిని సులభంగా అమర్చేలా
శిక్షణ ఇస్తారు. ఈ సాధనం వల్ల ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. అంతేకాదు, ఎప్పుడు
కావాలంటే అప్పుడు సులభంగా దీనిని తొలగించుకోవచ్చు. తొలగించిన 48 గంటల తర్వాత
గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్న వారికి ఎడమవైపు, ఎడమచేతి
వాటం ఉన్న వారికి కుడివైపున దీనిని అమరుస్తారు. కెన్యాలో ఈ విధానం దాదాపు
రెండున్నర దశాబ్దాలుగా అమల్లో ఉంది.