లండన్ : బ్రిటన్‌కు భారతీయ మూలాలున్న రిషి సునాక్ నూతన ప్రధాని కావడంపై ఆ దేశ ప్రసారమాధ్యమాలు రెండు ధ్రువాలుగా విడిపోయాయి. వాటిలో కొన్ని సునాక్ ఎంపికను స్వాగతించి ఆయన నేతృత్వంలో దేశానికి కొత్త ఉదయం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. మిగిలినవి ఆయన విజయాన్ని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యం మరణించిందని అభివర్ణించాయి. సునాక్ ప్రధాని అయిన విషయాన్ని బ్రిటన్‌లో ప్రధాన పత్రికలన్నీ మొదటి పేజీలో ప్రచురించాయి.
‘ఏకం చేయండి లేదా మరణించండి’ : కన్జర్వేటివ్ ఎంపీలతో సునాక్ పేర్కొన్న ‘ఏకం చేయండి లేదా మరణించండి’ అన్న వాక్యాన్నే ద గార్డియన్ పతాక శీర్షికగా పెట్టింది. లండన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రిషికి స్వాగతం చెబుతున్న సహచరులతో కూడిన ఫొటోను వాడింది. ‘‘ఆరు సంవత్సరాల్లో అయిదవ, రెండు నెలల్లో మూడవ కన్జర్వేటివ్ ప్రధానమంత్రిగా సునాక్ ఎంపియ్యారు’’ అని తన కథనంలో పేర్కొంది. దేశానికి నాయకత్వం వహిస్తున్న తొలి హిందువుగా ఆయన చరిత్ర సృష్టిస్తారు అని అభివర్ణించింది. దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించిన ‘ద మెయిల్’ తన పతాక శీర్షికను ‘‘బ్రిటన్‌కు నూతన సూర్యోదయం’’ అని రాసింది. ‘‘తొలిసారి ఆసియా వారసత్వంతో మాకు పిన్న వయస్కుడైన ఆధునిక ప్రధానమంత్రిగా రిషి సునాక్ అవతరించారు’’ అని ఉపశీర్షిను పెట్టింది. ‘ద సన్’ పత్రిక సునాక్‌కు అనుకూలంగా కథనం ఇస్తూ ‘‘బలగమంతా నీ వెనుకే రిషి’’ అని హెడ్డింగ్ పెట్టింది.
బ్రిటన్‌లో మరో ప్రధాన పత్రిక ‘ది మిర్రర్’ మాత్రం సునాక్ ఎంపికపై అక్కసును వెళ్లగక్కింది. ‘‘మా నూతన ప్రధాని..మీకు ఓటెవరేశారు? అని ప్రశ్నిస్తూ ప్రధాన కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా ‘‘రాజు కంటే రెండు రెట్ల ధనవంతుడైన వ్యక్తి’’ అని అభివర్ణించింది. ‘‘క్రూరమైన ప్రజా వ్యయాలపై కోతలకు నేతృత్వం వహించండి’’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. స్కాట్లాండ్కు చెందిన ‘డైలీ రికార్డు’ సునాక్‌పై ఘాటు విమర్శలకు దిగుతూ ‘‘ప్రజాస్వామ్యం చనిపోయింది’’ అని పేర్కొంది. సునాక్ ముందు పలు ఆర్థిక సవాళ్లు ఉన్నాయంటూ ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. సండే టైమ్స్ ఈ ఏడాది ప్రకటించిన ధనవంతుల జాబితాలో రిషి సునాక్, ఆయన భార్య అక్షతల సంపద ఉమ్మడిగా 700 మిలియన్ల పౌండ్లు ఉంటుందని అంచనా వేసింది. ఇది బ్రిటన్ రాజు చార్లెస్, ఆయన భార్య కెమిల్లాకు గల సంపద కంటే ఎక్కువని బ్రిటన్‌లోని మీడియాలో ఓ వర్గం వాదిస్తుంటుంది.