రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని
లండన్ : కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ను గాడినపెట్టే బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్‌కు మొదట్నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో తల్లి పనిచేసే ఫార్మసీ షాప్‌లో పని చేసినప్పుడే వాటి జమా ఖర్చులన్నీ చూసేవారు. పెరిగిపెద్దయ్యాక ఎంబీఏ చదివి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఎక్కువగా పనిచేశారు. భారతీయ కుటుంబానికి చెందిన రిషి సునాక్ యూకేలోని హ్యాంప్‌షైర్ సౌతంప్టన్‌లో మే 12, 1980లో జన్మించారు. తండ్రి యశ్వీర్ కెన్యాలోపుట్టి పెరిగారు. తల్లి ఉష సునాక్ టాంజానియలో పుట్టారు. ఆఫ్రికాలో భారతీయులపై దాడులకి భయపడి వారి కుటుంబం 1960 ప్రాంతంలోనే బ్రిటన్‌కు వలస వెళ్లిపోయింది. తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసీ నడిపేవారు. వారికి ఇద్దరు మగపిల్లలు. ఒక ఆడపిల్ల. రిషి అందరిలో పెద్దవాడు. తమ్ముడు సంజయ్ సైకాలజిస్టు కాగా, చెల్లి రాఖి ఐక్యరాజ్యసమితి విద్యా విభాగంలో చీఫ్ స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్నారు. రిషి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హాంప్‌షైర్‌లో సాగింది. కళాశాల విద్య వించెస్టర్‌లో చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ (పీపీఈ) 2001లో గ్రాడ్యుయేషన్ చేశారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అక్కడే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది. 2009, ఆగస్టులో అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. వారికి అనౌష్క, కృష్ణ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదువుకున్న సమయంలో హాలీడేస్‌లో సౌథంప్టన్‌లో కర్రీ హౌస్‌లో వెయిటర్‌గా పనిచేశారు. 2001–2004 మధ్య ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో ఎనలిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత హెడ్జ్ ఫండ్స్‌లో(ప్రైవేటు ఇన్వెస్టర్ల సంపద) భాగస్వామిగా ఉన్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కాటామారన్ వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి 2013–2015 మధ్య డైరెక్టర్‌గా ఉన్నారు.
2015లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కన్జర్వేటివ్ పార్టీ తరఫున యార్క్‌షైర్‌లో రిచ్మండ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. థెరిసా మే రెండోసారి ప్రధాని అయినప్పుడు 2018లో స్థానిక వ్యవహారాల శాఖ ఉప మంత్రిగా పని చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో రిచ్మండ్ నుంచే ఎన్నికై 60% ఓట్లను సాధించారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో 2019, జులై 24న ట్రెజరీకి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2020లో అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కాపాడుతూ భారీ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. కోవిడ్‌పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుకున్న బోరిస్ జాన్సన్ కేబినెట్ నుంచి వైదొలిగి ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. జాన్సన్ రాజీనామా చేసిన అనంతరం ప్రధాని పదవికి పోటీ పడ్డారు. అత్యధిక మంది ఎంపీలు ఆయనకు మద్దతునిచ్చినప్పటికీ టోరీ సభ్యుల ఓటింగ్‌లో లిజ్ ట్రస్ చేతిలో 21 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అపజయం ఎదురైన చోటే నెలన్నరలోనే సునాక్‌ని గెలుపు వరించడం విశేషం. రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లలోనే అక్టోబర్ 25న బ్రిటన్‌కు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు.