బ్రిటన్ యువ ప్రధాని రిషి సునాక్‌కి సవాళ్ల స్వాగతం
ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కించడమే రిషి ముందున్న అతిపెద్ద సవాల్
రష్యా విషయంలోనూ కఠినంగా వ్యవహరించే అవకాశాలు
బ్రిటన్ : బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం, సమ్మెలు, అక్రమ వలసలు, ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్లను రిషి సునాక్ ఏ విధంగా ఎదుర్కొంటారనే విషయాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. బోరిస్ జాన్సన్ రాజీనామాతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ 45 రోజులు గడవకముందే తన పదవిని వీడాల్సి వచ్చింది. దీంతో మూడు నెలల్లోనే బ్రిటన్ మూడో ప్రధానిని చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌కు అతి చిన్న వయసులోనే ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది. దీంతో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను చవిచూస్తోన్న బ్రిటన్ ప్రజలు రిషి సునాక్పైనే ఆశలు పెంచుకున్నారు. ముఖ్యంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, సమ్మెలు, పార్టీలో ఐక్యత, ఉక్రెయిన్ యుద్ధం వంటి ఎన్నో సవాళ్లు రిషి సునాక్‌కు స్వాగతం పలుకుతున్నాయి.
ఆర్థిక సంక్షోభం : కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బ్రిటన్ను ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడమే రిషి ముందున్న అతిపెద్ద సవాల్. బ్రిటన్ ద్రవ్యోల్బణం 10శాతం మించిపోతోంది. జీ7 దేశాల్లో ఇదే అత్యధికం. ఇంధన టారిఫ్‌లు, ఆహార ధరలకు రెక్కలొస్తున్నాయి. సంపాదన తగ్గుతూ జీవన వ్యయం పెరుగుతోందని పౌరులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు మినీ బడ్జెట్ పేరుతో లిజ్ ట్రస్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమయ్యాయి. ఆమె నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించింది. ఇలా మాంద్యం భయాలు నెలకొన్న బ్రిటన్‌లో మార్కెట్లను శాంతపరచి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని నింపడమే రిషి ముందున్న అసలైన సవాల్.
సై అంటున్న సమ్మెలు : ధరల పెరుగుదలతో బ్రిటన్ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రైల్వేతోపాటు ఇతర రంగాల్లోని యూనియన్లూ సమ్మెలకు పిలుపునిస్తున్నాయి. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, పని వేళలపై రైల్వే యూనియన్ సమ్మెకు సిద్ధమైంది. జీతాలు, పెన్షన్లపై యూకే ఉన్నత విద్యావిభాగం సిబ్బంది కూడా ఆందోళనలకు జై కొట్టారు. 150 యూనివర్సిటీల్లోని సుమారు 75వేల మంది క్రిస్మస్కు ముందే సమ్మెకు దిగాలని నిర్ణయించారు. కీలక ఆరోగ్య విభాగమైన నేషనల్ హెల్త్ సర్వీస్ సమ్మెకు సిద్ధమైంది. రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్..తన 106 ఏళ్ల చరిత్రలో ఇలా చేయడం ఇదే తొలిసారి. వీటితోపాటు పోస్టల్, టెలికాం, వైద్య రంగాల్లోని యూనియన్లు సమ్మెకు సై అంటున్నాయి.
పార్టీలో ఐక్యత : దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోన్న వేళ.. కన్జర్వేటివ్ పార్టీలో ఐక్యత కొరవడింది. పార్టీ నాయకుడైన ప్రధానమంత్రి తీసుకునే పలు నిర్ణయాలపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ అధికారంలో ఉన్న సమయంలో ఇవి స్పష్టంగా కనిపించాయి. ఇటువంటి తరుణంలో పార్టీని ఐకమత్యంగా నడిపించడం కూడా తన ప్రధాన కర్తవ్యమని రిషి సునాక్ తన ప్రచారంలో పదే పదే చెప్పారు. అందుకు అనుగుణంగా పార్టీలో ఐక్యత తెచ్చి.. సంక్షోభం నుంచి బయటపడేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయడం రిషి ముందున్న మరో సవాల్ అని చెప్పక తప్పదు.
కలవరపెడుతోన్న వలసలు : బ్రిటన్ కొత్త ప్రధానికి అక్కడి వలసల అంశం కూడా ఓ సవాలుగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 30వేల మంది దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటువంటి వలసలపై ఓ కొత్త విధానాన్ని రూపొందించే యోచనలో ఉన్నట్లు రిషి సునాక్ ఇదివరకు తెలిపారు. శరణార్థులపై ఓ స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తామని, ఆశ్రయం కోసం వచ్చే వారి సంఖ్యపై వార్షిక నియంత్రణ తీసుకొస్తామని చెప్పారు. అక్రమంగా దేశంలోకి వచ్చే వారిని గుర్తించడం, పర్యవేక్షించడం కోసం ప్రత్యేక ప్రణాళికను తెస్తానని రిషి సునాక్ గతంతో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా వలస విధానాలను ఏ మేరకు అమలు చేస్తారనే విషయం చూడాల్సి ఉంది.
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు : భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కావడం ఇరు దేశాల సంబంధాలపై సానుకూల ప్రభావం చూపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరు దేశాల వాణిజ్య సంబంధాల్లో భాగంగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు చాలా కాలంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే, బ్రిటన్ హోంమంత్రిగా ఉన్న సమయంలో సుయెలా బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా సునాక్ ప్రధాని కావడంతో ఈ విషయంలో భారత్-బ్రిటన్ మధ్య సన్నిహిత సంబంధాలకు దోహదం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇరుదేశాల మధ్య రెండు-దారుల బంధం ఉండాలని ఆకాంక్షించిన సునాక్.. భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో యూకే విద్యార్థులు భారత్‌కు తేలికగా వెళ్లడం, అక్కడి కంపెనీల్లో పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వీటితోపాటు బ్రిటన్‌లోని భారతీయులకూ మేలు చేసే నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.
అంతర్జాతీయ సంబంధాలు : రష్యా చేస్తోన్న భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు బ్రిటన్ సహాయం చేస్తూనే ఉంది. ఇప్పటివరకు 2.6 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని బ్రిటన్ అందించింది. ఇటీవల దీనిపై మాట్లాడిన సునాక్ ఒకవేళ ప్రధాని ఐతే ఈ సహాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బ్రిటన్ ఉక్రెయిన్‌కు ఏ స్థాయిలో సహాయం కొనసాగిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు తమ దేశానికి, జాతీయ భద్రతకు చైనా ముప్పుగా మారిందని రిషి సునాక్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చైనాతోపాటు ఉక్రెయిన్‌పై భీకర యుద్ధానికి పాల్పడుతోన్న రష్యా విషయంలోనూ కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.