‘చుక్క’ల్లో అమ్మకాలు..ముక్కలతోనే భోజనాలు
22 రోజుల్లో రూ.160 కోట్ల మద్యం అమ్మకాలు
రూ.50 కోట్లకు పైనే మాంసం విక్రయాలు
ఇదీ మునుగోడు ఉప ఎన్నిక తీరు
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక సమీపించేకొద్దీ మద్యం వెల్లువెత్తుతోంది. కోళ్లు, మేకల తలలు తెగిపడుతున్నాయి. తాగినోళ్లకు తాగినంత..తిన్నోళ్లకు తిన్నంత అన్నట్లుగా ప్రధాన పార్టీల నిత్య విందులు సాగిపోతున్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో అక్టోబరు నెల 22 రోజుల వ్యవధిలో రూ.160.8 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఇవి నెల ముగిసే నాటికి రూ.230 కోట్లు దాటుతాయని అంచనా. గతంలో సాధారణంగా నల్గొండ జిల్లాలో నెలకు సగటున రూ.132 కోట్ల మద్యం అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే విక్రయాలు అంతకు రెట్టింపయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా మునుగోడులో, అత్యల్పంగా గట్టుప్పలలో అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు బయటి ప్రాంతాల నుంచి కూడా మద్యం వస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిసరాలు, ఇబ్రహీంపట్నం, దేవరకొండల నుంచి నియోజకవర్గంలోని బెల్ట్ దుకాణాలకు మద్యం సరఫరా అవుతోందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఎన్నికల పరిశీలకుల ఆదేశంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వినయ్కృష్ణారెడ్డి మద్యం దుకాణాలను తనిఖీ చేశారు.
చిల్లర నోట్లకు బేజారు : ప్రచారంలో నాయకులకు, వ్యాపారులకు చిన్న నోట్ల సమస్య ఎదురవుతోంది. అన్ని పార్టీలవారు రూ.500 నోట్లతోనే చెల్లింపులు చేస్తుండటంతో చిల్లర నోట్లకు కొరత ఏర్పడింది. ‘చిన్న నోట్లు దొరకడంలేదు. డిజిటల్లో చెల్లించాలని కోరితే పార్టీల వారు ఒప్పుకోవడంలేదు’ అని నాంపల్లికి చెందిన ఓ కిరాణా వ్యాపారి చెప్పారు.
ఇతర ప్రాంతాల నుంచి యువకులు : ఓ ప్రధాన పార్టీ 20 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న యువకులను వివిధ ప్రాంతాల నుంచి మునుగోడుకు రప్పిస్తోందని తెలిసింది. ఆంధ్ర, రాయలసీమల నుంచి హైదరాబాద్ వచ్చే రైళ్లలో రోజూ 200 మంది యువకులు నల్గొండ స్టేషన్లో దిగుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీరికి రోజూ రూ. 500 ఇచ్చి రెండు పూటలా భోజనం పెడుతున్నట్లు సమాచారం.
రూ.50 కోట్లకు పైగా మాంసం విక్రయాలు : నియోజకవర్గంలో మోహరించిన నాయకులు, కార్యకర్తలకు రోజూ రెండు పూటలా మాంసాహారం కోసం అన్ని గ్రామాల్లో మాంసం వినియోగం గరిష్ఠస్థాయికి చేరింది. దీనికోసం ఇప్పటివరకు ప్రధాన పార్టీలు రూ. 50 కోట్ల వరకు ఖర్చుపెట్టాయని అంచనా. చిల్లర, టోకు దుకాణాల వద్ద నాలుగు, ఐదింతల వ్యాపారం పెరిగింది. ‘గతంలో రోజూ 50 కిలోల చికెన్ అమ్మేవాణ్ని. ప్రస్తుతం రోజూ గిరాకీ 200 కిలోలు ఉంటోంది. ఆర్డర్ల ద్వారా మరో 200 కిలోలు గ్రామాలకు సరఫరా చేస్తున్నాను. ఉప ఎన్నిక పుణ్యమా అని నా అప్పులు తీరిపోయాయి’ అని చెప్పారు మునుగోడులోని ఓ దుకాణదారు.
ఈ మండలంలో 1600 ఓట్లున్న ఓ గ్రామంలో గత 20 రోజులుగా సుమారు 80 మేకలు, గొర్రెలను ఆహారానికి వినియోగించారు. చౌటుప్పల్ మండలంలో ఓ ప్రధాన పార్టీ ముఖ్య నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్న గ్రామంలో 20 రోజులుగా సుమారు 120 మేకలను వధించారు. కోడి మాంసం వీటికి అదనం. నల్గొండ, దేవరకొండ, నకిరేకల్, నాగార్జ్జునసాగర్తో పాటు నాగర్కర్నూల్ జిల్లా నుంచి నిత్యం నియోజకవర్గానికి సుమారు 30 – 40 వాహనాల్లో మేకలు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. ప్రధాన పార్టీల భోజనాల్లో శాకాహారంతో పాటు మటన్ లేదా చికెన్, కొన్నిచోట్ల తలకాయ కూర, బోటీ కూడా పెడుతున్నారు. ఉదయం అల్పాహారంలో రోజుకొక వంటకాన్ని వడ్డిస్తున్నారు.