తిరుమల : వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా తితిదే ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం కోటాను బుధవారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. రోజుకు 1500 చొప్పున టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.