బ్రిటన్ : కన్జర్వేటీవ్ పార్టీ అంటేనే సంప్రదాయవాదుల కంచుకోట. వివాదాలు ఈ పార్టీకి కొత్తేమీ కాదు. బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునాక్ కూడా దీనికి అతీతమేమీ కాదు. చిన్నచిన్న వివాదాల్లో సునాక్ పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన భార్య, ఇన్ఫీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షితా మూర్తిని సునాక్ ప్రత్యర్థులు విమర్శలకు లక్ష్యంగా చేసుకొంటుంటారు.
సంపన్నవర్గాలకు సన్నిహితుడంటూ : రిషి సంపన్నవర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రవేసేందుకు ప్రత్యర్థులు తరచూ 2001లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తారు. అప్పట్లో సునాక్ బీబీసీ డాక్యూమెంటరీ ‘మిడిల్‌క్లాస్: రైజ్ అండ్ స్ప్రోల్’లో మాట్లాడుతూ తనకు రాచకుటుంబీకులు, ఉన్నత వర్గాల వారే మిత్రులుగా ఉన్నారని పేర్కొన్నారు. తనకు వర్కింగ్ క్లాస్‌లో మిత్రులు లేరన్నారు. సునాక్‌ను ప్రజల మనిషి కాదని చెప్పారనేందుకు ఈ క్లిప్‌ను ప్రత్యర్థులు వాడుకొన్నారు.
అక్షితా నివాసహోదాపై : సునాక్ సతీమణి అక్షితామూర్తి నివాస హోదా వివాదాస్పదమైంది. ఈ ఏడాది ఆమె 30,000 పౌండ్లు చెల్లించి తన నాన్-డొమిసిల్ హోదాను ఏడాది పాటు పొడిగించుకొన్నారు. ఆమె యూకేలో పన్నులు ఎగ్గొట్టేందుకే ఈ హోదాను వాడుకొంటున్నారని సునాక్ ప్రత్యర్థులు ఆరోపించారు. దీనిపై కొన్నాళ్ల క్రితం అక్షితా స్పందించారు. ‘నా పన్ను హోదా నా కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారకూడదని భావిస్తున్నాను. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా లభించే ఆదాయంపై యూకేలో కూడా పన్ను చెల్లిస్తాను’ అని ప్రకటించారు.
రష్యా సొమ్ము అంటూ : ఉక్రెయిన్‌పై ఆక్రమణ మొదలైన సమయంలో రష్యాలో పెట్టుబడులను షెల్, బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలు నిలిపివేశాయి. దీనిని సునాక్ అభినందించారు. కానీ, అక్షితా మూర్తి మాత్రం ఇన్ఫోసిస్ సొమ్ము తీసుకొంటున్నారని, ఆ కంపెనీ రష్యాలో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్న విమర్శలు వచ్చాయి. ఇన్ఫీ రష్యాలో కార్యకలాపాలు నిలిపివేసేందుకు నిరాకరించింది. ఉక్రెయిన్ ఎంపీ లెసియా వాసిలెంకో పరోక్షంగా ఇన్ఫీ నుంచి సొమ్ము అంశంపై మాట్లాడుతూ ‘‘ప్రతి కంపెనీకి దాని ఎంపికలు ఉంటాయి. ఎప్పటిలానే వ్యాపారం చేసి సొమ్మును సంపాదించవచ్చు. కానీ ఇది రక్తపు సొమ్ము రక్తపు వ్యాపారం అనే వాస్తవంతో జీవించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
బ్రెడ్ వ్యాఖ్యలపై దుమారం : సునాక్ బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ షోలో పాల్గొన్న సమయంలో మీరు ఎటువంటి బ్రెడ్‌ను ఇష్టపడతారని వ్యాఖ్యాత సునాక్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన తమ ఇంట్లో చాలా బ్రెడ్లు ఉంటాయని, తాను, తన భార్య ఆరోగ్య అవసరాలకు తగినట్లు అవి ఉంటాయని వివరించారు. ఈ సమాధానం ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. షాడో ఫుడ్ సెక్రటరీ జిమ్ మెక్‌మోహన్ మాట్లాడుతూ ఒక్క రొట్టెకొనడానికి ఛాన్స్లర్ (సునాక్) కష్టపడి ఉంటే అతడు ఇతర కుటుంబాలకు మద్దతు ఇచ్చేవాడని విమర్శించారు.