న్యూ ఢిల్లీ : సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఫిలిప్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 4000 మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 4000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఐదు శాతానికి సమానం. కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తీసుకోక తప్పడం లేదని సీఈఓ రాయ్ జాకోబ్స్ అన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. మూడు నెలల వ్యవధిలో కంపెనీ విక్రయాల విలువ ఐదు శాతం తగ్గి 4.3 బిలియన్ యూరోలకు చేరింది. కంపెనీలో ఉత్పాదకతను పెంచడం కోసమే ఉద్యోగాల తొలగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జాకోబ్స్ తెలిపారు. దీన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలోని సమస్యలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో కరోనా వ్యాప్తి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలు కంపెనీ విక్రయాలపై ప్రభావం చూపాయన్నారు.