ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో ఒక క్యాలెండర్ ఇయర్ ఫార్మాట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత క్రికెట్ జట్టు రికార్డు నెలకొల్పింది. సరిగ్గా 19 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పేరిట ఉన్న ఆ రికార్డును ఇప్పుడు భారత్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు 2003 క్యాలెండర్ ఇయర్లో మొత్తం 47 మ్యాచ్‌లు ఆడి 38 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అప్పటి నుంచి 19 ఏండ్లుగా అదే రికార్డుగా ఉంది. కానీ, ఈ ఏడాది భారత జట్టు ఆ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం ద్వారా భారత్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. నిన్నటి గెలుపు భారత జట్టుకు ఈ క్యాలెండర్ ఇయర్లో 39వ గెలుపు. దీంతో భారత్ ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు మొత్తం 56 మ్యాచ్‌లు ఆడి 39 విజయాలు సాధించినట్లయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. రెండు సిరీస్‌లలోనూ ఆ టీమ్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత సొంతగడ్డపైనే శ్రీలంక జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇండియన్ టీమ్.. ఆ రెండు సిరీస్‌లను కూడా వరుసగా 3-0, 2-0తో గెలుచుకుంది. అలా ఇప్పటివరకు వరుస విజయాలు సాధిస్తూ నిన్న పాకిస్థాన్‌తో 39వ విజయం నమోదు చేసింది.
మూలం: జీ న్యూస్