రాబోయే 50 ఏళ్లకు గాను ప్రభుత్వం వ్యవసాయ పథకాలను రూపొందించాలని, అందుకోసం యువత తమ ప్రధాన వృత్తిగా వ్యవసాయాన్ని చేపట్టే బాధ్యతను భుజాలకెత్తుకోవాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గోవా సాన్క్వెలిమ్లోని రవీంద్ర భవన్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైతు సంస్థ అయిన బిచోలిమ్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను గోవా సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు అనేక పథకాలు, రాయితీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. అంతేకాకుండా, కొత్త సాంకేతిక పద్ధతులు చేపట్టడం ద్వారా సహజ వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అందువల్ల యువత వ్యవసాయం చేసే అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. అలాగే మంచి ధర పొందడంలో కొత్త రైతు సంస్థ సహాయపడుతుందన్నారు. వారి ఉత్పత్తులు, వివిధ వ్యవసాయ పథకాలకు సంబంధించిన వివరాల సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. దీని ఫలితంగా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. ఇలాంటి మరిన్ని కంపెనీలను ప్రారంభించాల్సిన అవసరం ఉందనన్నారు. రైతులు తమ ఉత్పత్తులు రెట్టింపు చేసేలా, స్వావలంబన దిశగా పయనించేలా ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారనారు. ఇలాంటి కంపెనీలను ప్రారంభించి రైతులను ఆదుకునేందుకు ఆయన ప్రత్యేక కృషి చేస్తున్నారని ప్రమోద్ సావంత్ కొనియాడారు.
మూలం: హెరాల్డ్ గోవా