తమన్నాకు దసరా, దీపావళి పండుగలంటే చాలా ఇష్టం. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఈ రెండు పండుగలకు మాత్రం ముంబైలోని ఇంటిలో వాలిపోవాల్సిందే! దసరా, దీపావళి పండుగలకు ఇంటి దగ్గర లేని సందర్భాలు చాలా తక్కువని తమన్నా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. పైగా ఆమె లక్ష్మీ పూజా ఘనంగా చేస్తారు. చాలాకాలం తర్వాత తమన్నా దీపావళిని కుటుంబ సభ్యులతో కాకుండా సెట్లో జరుపుకొంటున్నారట. ఈ విషయం గురించి ఆమె స్పందించారు. ప్రస్తుతం ‘దిలీప్ 147’ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కేరళలో జరుగుతోంది. షూటింగ్ వల్ల తమన్నా ఈసారి ఇంటికి వెళ్లడం కుదరలేదు. అందుకే మలయాళ చిత్ర బృందంతో పండుగ జరుపుకోనున్నట్లు తమన్నా తెలిపారు. ‘‘దీపావళి రోజు పని చేయడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పలేదు. ఇంట్లో కాకుండా ఈ సారి ఇక్కడ చిత్రబృందంతో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఇదో కొత్త అనుభూతి. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానులు నాపై చూపే ప్రేమే నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది. నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’లో నటిస్తోంది. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది.