కీవ్ : ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులెవరైనా ఉంటే.. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని అక్కడి భారత దౌత్య కార్యాలయం ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దాటేందుకు భారతీయులకు అందుబాటులో ఉన్న మార్గాల జాబితాను వెల్లడించింది. రాజధాని కీవ్‌తోపాటు ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా దాడులు ఉద్ధృతమైన విషయం తెలిసిందే. మరోవైపు పుతిన్ అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులెవరైనా ఉంటే వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని అక్కడి భారత దౌత్య కార్యాలయం ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దాటేందుకు భారతీయులకు అందుబాటులో ఉన్న మార్గాల జాబితాను వెల్లడిస్తూ విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌తో హంగేరి, స్లొవేకియా, మాల్డోవా, పోలండ్, రొమేనియా దేశాల సరిహద్దులోని చెక్పాయింట్ల వివరాలను పొందుపర్చింది. ప్రయాణ సౌకర్యాలనూ తెలిపింది.
ఉక్రెయిన్ సరిహద్దు దాటేందుకు వచ్చే భారతీయ పౌరులు ప్రయాణ సమయంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పాస్‌పోర్ట్, వీసా, ఉక్రెయిన్ నివాస పర్మిట్, ఐడీ కార్డులు, విమాన టికెట్లు ఇతరత్రా ధ్రువపత్రాలు వెంట తెచ్చుకోవాలని కోరింది. దీంతోపాటు అక్కడి భారత రాయబార కార్యాలయాల ఫోన్ నంబర్లు, ఇతర అత్యవసర నంబర్లను పేర్కొంటూ విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల రష్యా- క్రిమియాను కలిపే కీలకమైన కెర్చ్ వంతెనపై భారీ పేలుడు సంభవించింది. వంతెన పేల్చివేతకు ఉక్రెయినే కారణమని ఆరోపిస్తోన్న మాస్కో.. నాటి నుంచి కీవ్‌పై ప్రతిదాడులను పెంచింది. ఇంధన వసతులపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఈ పరిణామాల నడుమ కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయం ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.