భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ఇప్పుడది 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. 10 లక్షల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. రోజ్‌గార్ మేళా (ఉద్యోగ మేళా) పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 100 ఏళ్లుగా పీడిస్తున్న అతిపెద్ద సంక్షోభానికి చెందిన దుష్ప్రభావాలు 100 రోజుల్లో పోవన్నారు. ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నాయని, భారత్‌పై కూడా ఆ ప్రభావం ఉందని, అయితే తాము దాన్ని అధిగమించామని మోదీ అన్నారు. కొన్ని లక్ష్యాలు, కొన్ని రిస్క్‌లు తీసుకుని దేశ ఆర్థిక రంగాన్ని నిలబెట్టగలుగుతున్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఈ 8 ఏళ్లలో చాలా మట్టుకు తగ్గించగలిగామని ప్రధాని మోదీ అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా 75,226 మంది యువతకు నియామక పత్రాలు ఇచ్చారు.
మూలం: ఇండియా టీవీ