ఢిల్లీలోని ఒక సీనియర్ పోలీసు అధికారి కుమార్తె పై ఎఫ్ ఐ ఆర్ దాఖలైంది. ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ లోని ప్రముఖ మాల్ వెలుపల తన కారుతో పార్కింగ్ అటెండర్ (35)ను ఆమె ఢీకొట్టినట్లు అభియోగాలు మోపారు. ఈ సంఘటన అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం సాకేత్‌లోని సెలెక్ట్ సిటీ మాల్ వెలుపల జరిగింది. ఈ ఘటన నిఘా కెమెరాలలో రికార్డయింది. రాత్రి 9.35 గంటల సమయంలో పార్కింగ్ అటెండర్ పైకి కారుతో ఆ మహిళ దూసుకెళ్ళింది. దీంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని మాక్స్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. గాయపడిన వ్యక్తి గురువారం మహిళపై సాకేత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఢిల్లీ పోలీసు అధికారి కుమార్తె అని తరువాత తేలింది. ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు మహిళపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు.
మూలం: హిందూస్తాన్ టైమ్స్