జంటల బ్లాక్ మెయిల్.. నలుగురి అరెస్టు
ఓయో హోటళ్లలోని గదుల్లో రహస్య కెమెరాలను అమర్చి జంటల సన్నిహిత క్షణాలను రికార్డు చేస్తున్న నలుగురిని నోయిడాలోని గౌతమ్ బుద్దనగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులు అక్రమ కాల్ సెంటర్లను కూడా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు వారి అరెస్టుతో నోయిడాలో మూడు వేర్వేరు ముఠాలను ఛేదించినట్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విష్ణు, అబ్దుల్ హోటల్లోని వేర్వేరు గదుల్లో జంటల వ్యక్తిగత కార్యకలాపాలను రహస్యంగా రికార్డ్ చేసి, ఆ తర్వాత వీడియోలను పబ్లిక్‌లో పెడతామని బెదిరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేవారు. ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన జంటలను డబ్బు డిమాండ్ చేసేవారు. అందుకు నిరాకరిస్తే వారి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించేవారు.
ఇదిలా ఉండగా, ముఠాలోని అనురాగ్ ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా తక్కువ ధరలకు ఐఫోన్లను విక్రయిస్తామనే సాకుతో బాధితులను మోసం చేయడానికి అక్రమ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనురాగ్ దాదాపు రెండేళ్లుగా ఈ పని చేస్తున్నాడని, మూడు కాల్ సెంటర్లు నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. కోట్లాది మంది ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మూడో నిందితుడు పంకజ్ ఇతర వ్యక్తుల పేరిట రిజిస్టర్ చేసిన సిమ్, ఖాతాలను అందించి దోపిడీకి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు 11 ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్‌లు, 22 ఏటీఎం కార్డులు, పాన్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.
మూలం: ఇండియన్ ఎక్స్‌ప్రెస్