ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్న ఆయన ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అభిమానులను కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని, హడావుడి చేయవద్దని ప్రభాస్ సమాచారం ఇచ్చాడు. ఆదివారం (23, అక్టోబర్) పుట్టినరోజు. మామూలుగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకకు దూరంగా ఉంటారు. స్నేహితులు బలవంతంగా కేక్ కట్ చేయిస్తే తప్ప ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. పైగా ఇటీవల ఆయన కుటుంబానికి పెద్ద అయిన కృష్ణంరాజు మరణించడం, ఆయన ఆ బాధలో ఉండడంతో ఈసారి అభిమానులను కూడా ఎలాంటి హడావుడి చేయవద్దని సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్‌పై పిచ్చి ప్రేమ పెంచుకున్న అభిమానులు ఏం చేస్తారో చూడాలి.