న్యూజిలాండ్ ఘన విజయం
టీ-20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాకు చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ షాకిచ్చింది. 201 పరుగుల భారీ లక్ష్య ఛేద నకు దిగిన ఆస్ట్రేలియా కేవలం 17.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ 89 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, మెచెల్ సాంట్నర్ చెరో 3 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్డ్ 2 వికెట్లు, లూకీ ఫెర్గూసన్, సోధీ చెరో వికెట్ తీశారు. కివీస్ బౌలర్లు ఏ దశలోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు క్రీజులో కుదురుకోనివ్వలేదు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆసిస్ లైనప్‌ను దెబ్బతీశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో 28 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్యాట్ కమ్మిన్స్ 21 పరుగులతో 2వ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కాన్వే 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ ఫిన్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 23, గ్లెన్ ఫిలిప్స్ 12, నీషమ్ 26 పరుగులు చేశారు. 92 పరుగులతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కాన్వేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది.