టీ-20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పై ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. కేవలం 113 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చెమటోడ్చి గెలవాల్సి వచ్చింది. సులభంగా ఛేదించవ చ్చునని భావించిన ప్రత్యర్థి బ్యాటర్లకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో 113 పరుగులు తీయడానికి 18.1 ఓవర్లు ఆడిన ఇంగ్లీష్ జట్టు 5 వికెట్లు కోల్పోయి గెలుపును సొంతం చేసుకుంది. 29 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. జాస్ బట్లర్ (18), అలెక్స్ హేల్స్ (19), డేవిడ్ మలన్ (18), బెన్ స్టోక్స్ (2), లివింగ్‌స్టోన్ (29 నాటౌట్), హ్యారీ బ్రూక్ (7), మొయిన్ అలీ (8 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, మహ్మద్ నబీ తలో వికెట్ చొప్పున తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. 19.4 ఓవర్లలో 112 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రాన్ ఏకంగా 5 వికెట్లు తీసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్టోక్స్, మార్క్ ఉడ్ చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లలో ఇబ్రహిం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. మిగతావారెవరూ రాణించలేకపోయారు. దీంతో 112 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయ్యింది.