బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. తానిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ తాను ప్రధాని పదవిలో కొనసాగుతానని తెలిపారు. లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరో మారు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని పదవి చేపట్టిన 6 వారాల్లోనే లిజ్ ట్రస్ వివాదాల్లో చిక్కుకున్నారు. తొలిసారి ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్లో పేదలకు, సంపన్నులకు సమానంగా ఇంధన రాయితీలు ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చింది.
దీంతో మూడు రోజులుగా మౌనంగా ఉన్న ట్రస్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘‘తప్పులు చేశాం..
మన్నించండి’’ అని క్షమాపణలు చెప్పారు. తాను ఎక్కడికీ వెళ్లిపోనని, వచ్చే సాధారణ ఎన్నికలకు కన్జర్వేటివ్ పార్టీకి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు. బీబీసీతో ఆమె మాట్లాడుతూ.. ‘‘మేం తప్పులు చేశామని గుర్తించాను. వాటిని సరిదిద్దుకున్నాను. కొత్త చాన్స్‌లర్‌ను నియమించాను. ఆర్థిక స్థిరత్వాన్ని, క్రమశిక్షణను తిరిగి పెంపొందించాను.
ప్రజా సంక్షేమం కోసం మెరుగైన విధానాల్లో ముందుకు వెళ్తాం.’’ అని ట్రస్ చెప్పారు. అంతర్జాతీయంగా బ్రిటన్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం చూపిందని తెలిపారు. ‘‘ప్రజలకు ఏదో మేలు చేయాలని అనుకున్నాం. అధిక పన్నుల విషయంలో వారికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నాం. కానీ, మేం ఎక్కడో పొరపాటు చేశాం.’’ అని వ్యాఖ్యానించారు. కాగా, మినీ బడ్జెట్లో ప్రకటించిన పన్నుల తగ్గింపును పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు నూతన ఆర్థిక మంత్రి జెర్మీ హంట్ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.
దేశ దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితిపై హంట్‌కు అవగాహన ఉందన్నారు. ఇదిలా ఉండగా, బ్రిటన్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాజీ మంత్రి రుషి సునాక్ విజయం తథ్యమని పోల్ సర్వే ఒకటి పేర్కొంది.
మూలం: ఎన్.డి.టి.వి.