సివిల్ సర్వీసెస్ పరీక్షకు రెండుసార్లు ప్రయత్నించినా ఉత్తీర్ణత సాధించలేకపోయిన 28 ఏళ్ల యువకుడు ఘరానా మోసగాడిగా అవతారమెత్తాడు. హోం మంత్రిత్వ శాఖ అధికారిగా చెప్పుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 70 మందిని మోసం చేసి.. కోట్లాది రూపాయలు కాజేసినట్లు ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు. బీహార్‌లో రాంచీ పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని బీహార్ కు చెందిన శుభమ్ సింగ్ మోసాలకు పాల్పడేవాడు. బీహార్ లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, ఢిల్లీలోని ప్రముఖ కళాశాలలో బీకాం పూర్తి చేశాడు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశాడు. ఉత్తీర్ణత సాధించలేకపోవ డంతో ఖర్చుల కోసం ఆన్ లైన్ మోసాలకు శ్రీకారం చుట్టాడని ఫరీదాబాద్‌లోని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ నితేష్ అగర్వాల్ తెలిపారు. కళాశాల విద్య తర్వాత, సింగ్ తొలుత ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాడు. అ తరువాత గ్రేటర్ నోయిడాకు మారాడు.
“పోలీసులను కూడా తప్పుదారి పట్టించేంత తెలివైన వాడిగా అతడు ఎప్పుడూ భావించేవాడు. సోషల్ మీడియాలో తరచూ తన ప్రొఫైల్స్ మారుస్తూ ఉంటాడు” అని పోలీస్ అధికారి అగర్వాల్ చెప్పారు. ఢిల్లీలోని నార్త్, సౌత్ బ్లాక్‌లకు సమీపంలో తాను కేంద్ర అధికారిని అంటూ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నమ్మించేవాడని తెలిపారు. శుభమ్ సింగ్ బాలీవుడ్ చిత్రం “స్పెషల్ 26” నుంచి ప్రేరణ పొందాడని, ఇందులో మోసగాళ్లు దర్యాప్తు అధికారులుగా నటిస్తూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నల్లధనాన్ని దోచుకోవడానికి దాడులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.అదే రీతిలో సింగ్ నిరుద్యోగులను మోసగించేవాడని తెలిపారు.
మూలం: హిందూస్తాన్ టైమ్స్