దివంగత అందాల నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్. ‘దఢక్’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘గుడ్ లక్ జెర్రి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. జాన్వీ సోదరి ఖుషి కపూర్ కూడా త్వరలోనే స్క్రీన్ పైన రాబోతోంది. అందువల్ల తన సోదరికి జాన్వీ కపూర్ ఓ సలహాను ఇచ్చిందట. ఎట్టి పరిస్థితుల్లోను నటుడితో డేటింగ్ చేయొద్దని హెచ్చరించింది. ఖుషి కపూర్ తన మీద వచ్చే ట్రోల్స్‌ను హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలని జాన్వీ కపూర్ పేర్కొంది. ‘‘నటుడితో డేట్ చేయొద్దు. నటులతో డేట్ చేయకపోతే చాలా మంచిది.
మనకు కనిపించని ఎంతో మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ఒకటి అంటుంటారు. ట్రోల్ చేస్తుంటారు. బుల్లీయింగ్‌కు పాల్పడతారు. నటనతో పాటు ఎన్నో విషయాలను ఇంటికి తీసుకుని వస్తామని ఖుషి తెలుసుకోవాలి’’ అని జాన్వీ కపూర్ తెలిపింది. ఇక ఖుషి కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ‘ది అర్చీస్’ లో నటిస్తుంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తుంది. అందుక్కారణం ‘అర్చీస్’ లోని ప్రధానపాత్రల్లో బాలీవుడ్ స్టార్ కిడ్స్ నటిస్తున్నారు. బిగ్ బీ మనవడు అగస్త్య నందా, బాలీవుడ్ బాద్ షా కూతురు సుహానా ఖాన్ ఒకేసారి ఈ షో ద్వారా బీ టౌన్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. 1960ల నేపథ్యంలో లైవ్ యాక్షన్ మ్యూజికల్ డ్రామాగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టైగర్ బేబీ ప్రొడక్షన్స్‌తో కలసి గ్రాఫిక్ ఇండియా ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తుంది.