టీ-20 వరల్డ్ కప్‌లో భారత్, న్యూజిలాండ్ వామప్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. గాబా స్టేడియంలో బుధవారం భారత జట్టు ఆడాల్సిన రెండో, చివరి వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఇదే వేదికలో జరగాల్సిన పాకిస్థాన్-అప్ఘానిస్థాన్ మధ్య తొలి వామప్ పోరుకు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. 155 పరుగుల ఛేదనను ఆరంభించిన పాకిస్థాన్ 2.2 ఓవర్లలో 19/0తో ఉన్న తరుణంలో వాన కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. అలాగే సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య బ్రిస్బేన్ సబర్బ్ అల్బియాన్లోని అలెన్ బోర్డర్ స్ట్టేడియంలో జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌తో రోహిత్ సేన ప్రపంచ కప్ సమరాన్ని ఆరంభించనుంది. ఆ మ్యాచ్ సైతం వరుణుడి బారిన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.