బాణసంచా విక్రయాలు, పేలుళ్లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళికి కూడా ఢిల్లీ నగర పరిధిలో ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కు అనుమతిని నిరాకరించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ సారి కూడా ఢిల్లీ పరిధిలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధం ఉంటుందని ప్రకటించారు.
ఆన్ లైన్ లో కూడా పటాకుల అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని.. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను కఠినంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి తాజాగా బుధవారం ఎన్సిఆర్, పరిసర ప్రాంతాల్లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ పలు ఆంక్షలను విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఢిల్లీలో బాణసంచా నిషేధం అమలులో ఉంటుంది. దీని ప్రకారం బాణసంచా అమ్మినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా నేరమే. నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని ఢిల్లీ అధికారులు వెల్లడించారు.
వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీని ప్రకారం.. బాణసంచా అమ్మినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా నేరమేనని అధికారులు తెలిపారు. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించే సూచన ఉందని, అక్టోబర్ 22 నుంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా పేలవంగా మారవచ్చని బుధవారం ఢిల్లీలో జరిగిన సబ్-కమిటీ అభిప్రాయపడింది. ఢిల్లీలో బాణసంచా ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేస్తే రూ.5 వేల వరకు జరిమానాతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9బీ కింద మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించబడుతుందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. బాణసంచా నిషేధం అమలు కోసం 408 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
మూలం: జీ న్యూస్