చిరంజీవి -బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు
వీరయ్య’ . శ్రుతిహాసన్ కథానాయిక. రవితేజ కీలకపాత్ర పోషించారు. శుక్రవారం
ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం
‘వాల్తేరు వీరయ్య’. మెగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి
కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200
థియేటర్లలో ఇది విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద
మెగా మేనియా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ మాస్ లుక్‌లో చిరంజీవి
కనిపించడంతో అభిమానులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించేందుకు భారీగా థియేటర్ల
వద్దకు చేరుకుంటున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి
పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు, తీన్ మార్ డ్యాన్స్‌లతో థియేటర్
ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి. థియేటర్లలోనూ మాస్ జాతర కనిపిస్తోంది.
మెగాస్టార్ స్టెప్పులు, ఇంటర్వెల్ సీక్వెన్స్, రవితేజ-చిరు కాంబో సీన్స్
టైమ్‌లో కాగితాలు ఎగురవేసి డ్యాన్సులు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి
కుమార్తెలు శ్రీజ, సుస్మిత, చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ
ప్రసాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో సందడి చేశారు.
అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.