ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుతో
పాటుగా పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. 350కి పైగా
చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం
తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు
సానుభూతిని తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ : కృష్ణ మరణం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్
హరిచందన్ సంతాపం ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ
అధినేతగా తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు
మరువలేనివన్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో
చెరగని ముద్ర వేశారని, సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను
ప్రవేశపెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్‌స్టార్ కుటుంబసభ్యులకు
గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ : సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం
ప్రకటించారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లూరి
సీతారామరాజు పాత్రతో చిరస్థాయిగా నిలిచిపోయారని వెల్లడించారు. ఆయనే అల్లూరి.
ఆయనే మన జేమ్స్ బాండ్ అని తెలిపారు. నిజ జీవితంలోనూ మనసున్న మనిషి కృష్ణ అంటూ
పేర్కొన్నారు. కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి, తెలుగువారికి తీరని లోటు
వెల్లడించారు. కష్ట సమయంలో కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని
కోరుకుంటున్నానని సీఎం తెలిపారు.వెంకయ్యనాయుడు:కృష్ణ మృతి పట్ల మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి
అజరామరం అని పేర్కొన్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.