“ఇరవై రెండేళ్లుగా నటిస్తున్నాను. 150 పై తెలుగు సినిమాలు చేశాను. ‘ఎంత బరువైన
పాత్ర అయినా చాలా తేలికగా చేసి మెప్పిస్తాననే’ మంచి పేరు సంపాదించుకున్నాను.
కానీ “బేబి” సినిమాకు వచ్చినన్ని ఫోన్ కాల్స్, ప్రశంసలు ఇన్నేళ్లలో ఇప్పటివరకు
ఎప్పుడూ రాలేదు” అంటున్నారు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కు
పెట్టింది పేరైన “ప్రభావతి” !. “ఈ అబ్బాయి చాలా మంచోడు” చిత్రంతో నటిగా
అరంగేట్రం చేసి “ఈ అమ్మాయి చాలా మంచి నటి” అని అనిపించుకున్న ప్రభావతి…
“బేబి” సినిమాలో ఆనంద్ దేవరకొండ తల్లిగా నటించారు. “మిడిల్ క్లాస్ మెలోడీస్”లో
ఈమె వర్ష బొల్లమ్మ తల్లిగా అంటే ఆనంద్ దేవరకొండ అత్తగా నటించి ఉండడం విశేషం.
“బేబి” చిత్రంలో ఆమెది మూగ పాత్ర. హావభావాలతోనే అద్భుత నటన కనబరిచిన
ప్రభావతిని… చిత్ర కథానాయకులు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, దర్శకుడు
సాయి రాజేష్, నిర్మాత ఎస్.కె.ఎన్. తదితర చిత్ర బృందం తమ ప్రతి ఇంటర్వ్యూలో ఆమె
పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటే… ఈ చిత్రం బ్లాక్
బస్టర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం
అభినందించడం చూసినవాళ్ళల్లో ఆమెను ఎరుగనివారు “ఎవరీ ప్రభావతి?” అని ఆరాలు
తీస్తున్నారు!. “జైసింహా, మహానటి, మిడిల్ క్లాస్ మెలోడీస్, గోరింటాకు, సాహసం,
అమరావతి, అనసూయ, ఏక్ మినీ ప్రేమ్ కథ, గరుడ వేగ, సీటీమార్, లవ్ యు రామ్” వంటి
చిత్రాలతోనూ తన నటనకు మంచి మార్కులు సంపాదించుకున్న ప్రభావతి… ఇప్పుడు అందరూ
తనను “బేబి ప్రభావతమ్మా” అని పిలుస్తుంటే కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు
అంటున్నారు. “బేబి” సినిమా చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజులు చేస్తూ.. ‘అమ్మ’గా
వాళ్ళ గుండెల్లో చోటు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. నిజానికి
ప్రశంసలు ప్రభావతికి కొత్తేమీ కాదు… “జైసింహా” చిత్రంలో బాలకృష్ణ –
నయనతారలతోపాటు ఆ చిత్రంలో నటించిన ముఖ్య తారాగణం అంతా పాల్గొన్న ఒక కీలక
సన్నివేశంలో… ప్రభావతి పెర్ఫార్మెన్స్ కు ముగ్ధుడైన బాలయ్య… చప్పట్లు
కొట్టి మరీ సెట్ లోనే అందరి ముందు ప్రభావతిని అభినందించడం ఇండస్ట్రీలో
దాదాపుగా అందరికీ తెలుసు!. ప్రభావతి ప్రస్తుతం “సుందరం మాస్టారు, శ్రీకాకుళం
షెర్లాక్ హోమ్స్, సంపత్ నంది చిత్రం, రవితేజ ప్రొడక్షన్స్ లో “చాంగురే
బంగారురాజా” తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. “3 రోజెస్, రెక్కి” వంటి వెబ్
సిరీస్ లోను నటించి మెప్పించారు ప్రభావతి. ఈమె నటించిన “ఆదికేశవ”, “ప్రేమ్
కుమార్” సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. పూర్తిగా శ్రీకాకుళం యాసతో సాగే
“శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” చిత్రంలో “వెన్నెల కిషోర్, నాగ మహేష్, అనన్య
నాగల్ల”తో కలిసి టైటిల్ రోల్ చేస్తుండడం చెప్పుకోదగ్గ విశేషం!!