బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్ర శేఖర్ తో సంబంధాలను కొనసాగించిందనే ఆరోపణలను పోలీసులు ఆమెపై చారచజిషీట్ నమోదు చేశారు.. అతడి నుంచి రూ.7కోట్ల విలువైన బాహుమతులను జాక్వెలిన్ అందుకుందన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో జాక్వెలిన్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉంది. తాజాగా ఆమెకు మరింత ఉపశమనం లభించింది. ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆమెకిచ్చిన బెయిల్‌ను నవంబర్ 10 వరకు పొడిగించింది.
ఢిల్లీ కోర్టులో ఈ కేసు విచారణ అక్టోబర్ 22న జరిగింది. జాక్వెలిన్ లాయర్ ప్రశాంత్ పాటిల్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి తమకు ఎటువంటి పత్రాలు అందలేదన్నారు. దీంతో కేసుకు సంబంధించిన ఛార్జిషీట్, ఇతర పత్రాలన్నింటిని అన్ని పక్షాలకు అందించాలని కోర్టు సూచించింది. బెయిల్‌పై విచారణను నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. అప్పటి వరకు హీరోయిన్‌కు మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 26న మధ్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిందని ఈడీ కోర్టుకు తెలిపింది. దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పింది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది.