సరోగసీ కేసులో ఆధారాలు సమర్పించకుండా కేవలం వివరణ మాత్రమే ఇచ్చిన హీరోయిన్ నయనతారను కలసి వ్యక్తిగత విచారణ చేపట్టాలని తమిళనాడు రాష్ట్ర వైద్యశాఖ నిర్ణయించింది. నయనతార- విఘ్నేష్‌శివన్ దంపతులకు సరోగసీ ద్వారా కవలలు జన్మించడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో, ఆరు సంవత్సరాల క్రితమే తాము రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్లు నయనతార వెల్లడించారు. అంతేకాకుండా, సరోగసీకి సంబంధించి గత ఏడాది డిసెంబరులో ఒప్పందం కుదిరిందంటూ తెలిపారు. అయితే ధ్రువీకరణ పత్రాలేవీ తమకు అందజేయనందున నయనతారను విచారించాలని భావిస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.