నియోజకవర్గాల వారీగా సమీక్షలు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార వైసీపీకి ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఇబ్బందికర
పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ప్రతిపక్ష తెలుగుదేశం
పార్టీ బలం పుంజుకుంటోందనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ-టీడీపీ నాయకుల
మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది ప్రజల్లో కొంత వ్యతిరేకత పెంచుతోందనే
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య వైసీపీ సీనియర్ నాయకుడు,
అటవీ-విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రంగంలోకి దిగారు.
నియోజకవరగాల వారీగా సమీక్షలకు శ్రీకారా చుట్టనున్నారు. రోజూ రెండు
నియోజకవర్గాలు చొప్పున సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో
వైసీపీ నాయకులను కలుసుకోనున్నారు. పార్టీ స్థితిగతులపై నివేదికలు
తెప్పించుకోనున్నారు. ఇంతకూ జిల్లాలో ఏమి జరిగిందో చూద్దాం.
మొన్నటికి మొన్న రాప్తాడు నియోజకవర్గ పరిధిలో వైసీపీ-టీడీపీ నాయకుల మధ్య చోటు
చేసుకున్న వివాదాన్ని దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ
అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై రాప్తాడు
శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఘాటు
వ్యాఖ్యలు చేశారు. ఇది పరిటాల కుటుంబాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది.
పోలీస్ స్టేషన్ ముందు వారు ధర్నా చేయడంతో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి
దిగిరావాల్సి వచ్చింది. చివరికి ఆయన చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాల్సి
వచ్చింది.
క్షేత్రస్థాయిలో..
అటు తాడిపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే పట్టణంపై టీడీపీ
ఆధిపత్యం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇది స్పష్టమైంది కూడా. ఆ
ఎన్నికల్లో జేసీ కుటుంబం తన పట్టు నిలుపుకుంది. కల్యాణదుర్గం, రాయదుర్గంలలోనూ
ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే నివేదికలు వైసీపీ అగ్ర
నాయకత్వానికి అందినట్లు చెబుతున్నారు. కల్యాణదుర్గానికి ప్రాతినిధ్యం
వహిస్తున్నమంత్రి ఉషా శ్రీచరణ్ అనుచరులపై ఇదివరకు స్థానిక టీడీపీ నాయకులు
కబ్జా ఆరోపణలు చేశారు.
ఉమ్మడి అనంతపురంపై..
2019 ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి
అనంతపురం జిల్లా కూడా ఒకటి. ఇక్కడ మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..
టీడీపీకి దక్కింది- రెండే. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి
నందమూరి బాలకృష్ణ విజయం సాధించారంతే. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఈ రెండు
నియోజకవర్గాలు అటొకటి, ఇటొకటి అయ్యాయి. ఉరవకొండ అనంతలో కొనసాగుతుండగా..
హిందూపురం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోకి వచ్చింది.
టీడీపీకి వెన్నుదన్నుగా..
నిజానికి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ
వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది. 2014లో ఉరవకొండ, కదిరి మినహా అన్ని స్థానాల్లోనూ
టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులను తీసుకుని రావాలని ఆ
పార్టీ అధినేత చంద్రబాబు, జిల్లా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. .
దీనికి అనుగుణంగా వ్యూహాలను పన్నుతున్నారు.
రంగంలోకి ట్రబుల్ షూటర్..
ఈ పరిణామాల మధ్య మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రంగంలోకి దిగారు.
అనంతపురం జిల్లాలో నియోజకవర్గ సమీక్షలకు సమాయత్తమయ్యారు. రోజూ రెండు చొప్పున
నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9నుంచి
నియోజకవర్గ స్థాయి సమీక్షలు చేపట్టనున్నారు. మంత్రి ఉషా శ్రీచరణ్
ప్రాతినిధ్యం వహిస్తున్నకళ్యాణ దుర్గం నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నారు.
9వ తేదీన కల్యాణదుర్గం, రాయదుర్గం,10న గుంతకల్లు, ఉరవకొండ,11న తాడిపత్రి,
శింగనమల,12వ తేదీన రాప్తాడు, అనంతపురం నియోజకవర్గ స్థాయి నాయకులతో
సమావేశమవుతారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.