బీసీల ఓట్లే లక్ష్యంగా అడుగులు..
మూడేళ్లలో రాజకీయ సాధికారతకు కృషి చేశామని వెల్లడి
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శలు..
బీసీల ఓట్లే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. మూడేళ్లలో బీసీల రాజకీయ
సాధికారతకు ఎంతో కృషి చేశామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీల అభ్యున్నతే
ధ్యేయంగా పని చేసిన ఏకైక పార్టీగా చరిత్రలో వైసీపీ నిలుస్తుందని వారు
పేర్కొంటున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా ఉన్న వెనుకబడిన కులాల(బీసీ)
అభ్యున్నతి కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన కృషి గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని
చెబుతున్నారు. జయహో బీసీ పేరుతో బుధవారం విజయవాడలో భారీ బహిరంగ సభ
నిర్వహించనున్నారు. ఈ సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ
శ్రేణులు తరలి వెళ్ళాయి. కాగా, వైసీపీ జయహో బీసీ సభ అనగానే టీడీపీలో గుబులు
మొదలైందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
ఈ మూడున్నర ఏళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన జగన్ ను చూసి టీడీపీ నేతలు
తట్టుకోలేకపోతున్నారన్నారు. టీడీపీ బీసీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు
రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, కళా వెంకట్రావు..తదితరులంతా
చంద్రబాబు హయాంలో బీసీలకు ఏ ఒక్క మేలూ చేయలేకపోయారని విమర్శించారు. బీసీలకు
వివిధ పథకాల కింద దాదాపు రూ.86 వేల కోట్లు డీబీటీ ద్వారా అందజేశామన్నారు.
టీడీపీ నాయకులు పదే పదే బీసీ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావిస్తారని, ఏటా రూ.10
వేల కోట్లు ఇస్తామని చెప్పి, అయిదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.19 వేల
కోట్లేనని, అది కూడా బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇచ్చారన్నారు. ఇవాళ
యాదవులు, శెట్టి బలిజలు, నాయీ బ్రాహ్మణులు, స్వర్ణకారులు, రజకులు ఇలా ప్రతి
ఒక్క బీసీ తమకు గౌరవం పెరిగిందని భావిస్తున్నారన్నారు. తమకు అన్నింటా సమాన
హక్కులు, అవకాశాలు దక్కాయని చెబుతున్నారన్నారు. గ్రామ వార్డు మెంబరు నుంచి
మేయర్లు, ఛైర్మెన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు
చేశారు. మీ పార్టీ నుంచి ఒక్క బీసీని అయినా రాజ్యసభకు పంపించారా? అదే జగన్ ఈ
మూడేళ్లలో రాష్ట్రం నుంచి నలుగురు బీసీలను రాజ్యసభ సభ్యులను చేశారన్నారు. జయహో
బీసీ మహాసభకు గ్రామ స్థాయి నుంచి రాజ్యసభ వరకు అన్ని పదవుల్లో ఉన్న బీసీ
ప్రతినిధులను ఆహ్వానించామన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పదవుల్లో
ఉన్న దాదాపు 85 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు
ఏలూరులో బీసీ గర్జన సభలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని సీఎం అమలు చేశారని
గుర్తు చేశారు. 39 కులాలను గుర్తించి, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు.
కులాల వారీగా జనగణన కూడా చేసి, వారికి మేలు చేస్తున్నారని, అందుకే బీసీల
గుండెల్లో జగన్ శాశ్వతంగా నిల్చిపోతున్నారన్నారు.
తమ పార్టీలో బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చామో, టీడీపీ వారు ఎన్ని ఇచ్చారో
దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాలు చేశారు.