విజయవాడ : విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా రాజ్యాంగ
దినోత్సవ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
నిర్దేశించారని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
తెలిపారు. గవర్నర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రత్యేక అతిధిగా కార్యక్రమానికి హాజరు కానున్నారని, ఉదయం 11గంటలకు కార్యక్రమం
ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో గవర్నర్ హరిచందన్ సందేశం ఇస్తూ
రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని 73 సంవత్సరాలు అవుతుందన్నారు. వేల సంవత్సరాల
నాగరికత కలిగిన భారతావనికి ఈ ఏడు దశాబ్దాలు పెద్ద విషయం కాదని, కానీ పరాయి
పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య లిఖిత
రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఇది ఎంతో గర్వకారణమన్నారు. రాజ్యాంగ
దినోత్సవం రోజున విద్యా సంస్థల్లో రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్
జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పేద
బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని, ఆ మహనీయుని
జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందని గవర్నర్ వివరించారు.