ఉత్తర్వులు జారీ
విజయవాడ : అజిత్ సింగ్ నగర్ – పాయకాపురం పరిసర ప్రాంతాలలో నూతన ట్రాఫిక్
పోలీస్ స్టేషన్ (అండర్ ‘డి’ కేటగిరీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్
సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం హోం శాఖ జీవో నెం. 169 విడుదల చేసినట్లు
ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నగరం నానాటికి విస్తరిస్తున్న
తరుణంలో అజిత్ సింగ్ నగర్ ప్రాంత రూపురేఖలలో ఎంతో మార్పు వచ్చిందని.. దీనికి
తోడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఉండటంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ మరింత
అధికమైందని మల్లాది విష్ణు తెలిపారు. మరోవైపు విజయవాడ – నూజివీడు ప్రధాన
రహదారిలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా.. సమస్యను
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వివరించడం జరిగిందన్నారు. ఈ
ప్రాంతంలో పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా నూతన ట్రాఫిక్ పోలీస్
స్టేషన్ ను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతపై సుధీర్ఘంగా చర్చించినట్లు
వెల్లడించారు. ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కారు గురువారం
ఉత్తర్వులు జారీ చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీలైనంత త్వరలో ఈ ప్రాంత
ప్రజల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.