టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి
తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం
తిరుమల : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురు, శుక్రవారాల్లో జరుగనున్న గజ, గరుడ
వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని
గురువారం ఉదయం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టిటిడి
ఈవో ఎవి.ధర్మారెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి
అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, నవంబర్ 28న చివరి రోజు పంచమి
తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు
చేపట్టామని తెలిపారు. గురువారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహన సేవ
జరగనుందని, ఇందుకోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన
అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని ఆలయ నాలుగు వీధుల్లో
శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు. తిరుమలలో జరిగిన
కార్యక్రమంలో విజివో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు.
తిరుచానూరులో శ్రీవారి లక్ష్మీకాసులహారం స్వీకరించిన టిటిడి జెఈవో
అనంతరం తిరుమల నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి
తీసుకొచ్చారు. అక్కడ ఈవో ఎవి.ధర్మారెడ్డి కాసులహారాన్ని జెఈవో
వీరబ్రహ్మంకు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి
మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ
ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి
అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, ఆగమ సలహాదారు
శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి,
సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దాము, ఇతర
అధికారులు పాల్గొన్నారు.