విజయవాడ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే రాజకీయ ప్రత్యర్ధుల
అబద్ధాల నాటకం మొదలైందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి
విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బుధవారం ఒక ప్రకటనను విడుదల
చేశారు. టిడిపి రాని కంపెనీలను, లేని వ్యాపార సంస్థలను ఇక రాకుండా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరిమేసిందనే ప్రచారం మొదలెట్టిందని దుయ్యబట్టారు.
వాస్తవానికి అఖిలాంధ్ర ప్రజానీకం అధికారం నుంచి శాశ్వతంగా తరిమేసింది
చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని అని చెప్పారు. ఈ చేదు నిజాన్ని
దిగమింగుకోలేక బాబూ అండ్ కంపెనీ, ఆయన పక్క వాయిద్య మీడియా కంపెనీలు జగన్
గారు సీఎం అయ్యాక కంపెనీలు ఏపీ నుంచి పోతున్నాయనే అత్యంత నీచమైన ప్రచారం
మొదలెట్టాయని మండిపడ్డారు. చంద్రబాబు చివరి హయాంలో 2014–19 మధ్య చేసుకున్న
ఉత్తుత్తి వ్యాపార ఒప్పందాలు ఆయన పాలనలోనే వాస్తవ రూపం దాల్చలేదని
తెలియజేశారు. కాని, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఏడుపుతో
‘భారీ పెట్టుబడులతో రావాల్సి ఉన్న’ కంపెనీలు కనుమరుగయ్యాయి–అంటూ తెలుగుదేశం
అనుకూల మీడియా దర్శకత్వంలో టీడీపీ అగ్రనేతలు, చోటామోటా నాయకులు వీధుల్లో
అల్లరి మొదలు బెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ గోలను ప్రజలు సహించలేదు. చంద్రబాబు బృందం వేస్తున్నది అసత్యాల వీధిబాగోతం
అని తేల్చేశారు తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు
ఏడాదిన్నర దూరంలో ఉండడంతో బాబు ఒడిలోని మీడియా మళ్లీ ‘కంపెనీలను సర్కారు
తరిమేస్తోంది,’ అంటూ 2019 నవంబర్ లో మొదలు బెట్టిన ట్విటర్ దుష్ప్రచారం
గుర్తుకొచ్చేలా పత్రికల్లో కథలు వండిపోస్తోందని చెప్పారు.సామాన్య ప్రజలకు
ఉపాధి, ఉద్యోగాలకు అవకాశం ఇచ్చే కంపెనీలను సాగనంపినా, అసలు ఇంకా రాని వాటిని
అడుగుపెట్టనీయకపోయినా ఆయా సంస్థల యజమానులు నోళ్లు మూసుకోరు. వందలాది కంపెనీల
పేరు చెప్పి ప్రజాధనం దోచుకున్న పాపానికి 2004 ఏప్రిల్–మే ఎన్నికల్లో
బాబుటీడీపీని రికార్డు స్థాయిలో అత్యంత తక్కువ సీట్లకు (294కు 47 మాత్రమే) జనం
కుదించారు. తర్వాత 15 ఏళ్లకు నవ్యాంధ్ర ప్రజలు 23 స్థానాలకు పచ్చ పార్టీని
పరిమితం పరిమితం చేశారు. ఇంత జరిగినా మళ్లీ మూడు సంవత్సరాల క్రితం మొదలెట్టిన
అబద్ధాల డ్రామాకు తెరతీస్తేదాన్ని చూసే ప్రేక్షకులు గాని, టీడీపీ నేతలు మాటలు
నమ్మే ఓటర్లు గాని ఉండరని చెప్పారు.
భారత రాజ్యాంగం ప్రకారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్
ప్రభుత్వం చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చి, ఉత్పత్తి
ప్రారంభించడానికి సంసిద్ధమయ్యే ఏ వ్యాపార సంస్థనూ సాగనంపదనీ, దగ్గరుండి
ప్రోత్సహిస్తుందని గత మూడున్నరేళ్ల అనుభవం చెబుతోంది. ఏపీలో ఇప్పుడు వ్యాపారం
చేయడం అత్యంత సులువైన కార్యకలాపమని కూడా అంతర్జాతీయ వ్యాపార పరిస్థితుల
పరిశీలన సంస్థలు తేల్చిచెబుతున్నాయి. అవును, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. చంద్రబాబుకు ఏపీ ఓటర్లు 2024లో
‘గుడ్ బై ఫరెవర్, అన్నయ్యా,’ అని చెప్పడానికి సిద్ధమౌతున్నారని
విజయసాయిరెడ్డి చెప్పారు.