59వ డివిజన్ 243 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : రాష్ట్రంలో నవరత్నాల పథకాల ద్వారా ప్రజల సంక్షేమాభివృద్ధికి సీఎం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 59 వ డివిజన్ 243 వ
వార్డు సచివాలయ పరిధి అజిత్ సింగ్ నగర్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి,
స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో కలిసి ఆయన పాల్గొన్నారు. 261
గడపలను సందర్శించి సంక్షేమ బుక్ లెట్లను అందజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం
పేదలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ నేడు
ఏ గడప తొక్కినా కనీసం 3 నుంచి 8 పథకాల ద్వారా లబ్ధి చేకూరిన కుటుంబాలే
దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్
స్వీకరించారు. సైడ్ కాలువల్లో నీరు పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని
సిబ్బందిని ఆదేశించారు. దోమలు చేరకుండా ఎప్పటికప్పుడు మందు పిచికారీ
చేయాలన్నారు. అలాగే గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం తూర్పు వైపు గోడ ఎత్తును
పెంచి ఆకతాయిలు ప్రవేశించకుండా ఫెన్సింగ్ తో పరిరక్షించాలని అధికారులకు
సూచించారు.
రైతు బజార్ సందర్శన
రైతు బజార్లో కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని మల్లాది విష్ణు
పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా స్థానిక రైతు మార్కెట్ ను ఆయన సందర్శించారు. ఈ
సందర్భంగా తూనికలు, ధరల పట్టికలను పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు తక్కువ
ధరకు అందుతున్నదీ, లేనిదీ వినియోగదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. బోర్డులపై
రాసిన ధరలు అందరూ పాటించాలని ఎలాంటి వ్యత్యాసాలు రాకూడదని తెలిపారు. ప్రతి
దుకాణం వద్ద శుభ్రత పాటించాలని సూచనలు చేశారు. అలాగే మార్కెట్లో పారిశుద్ధ్య
పనులు సక్రమంగా జరగాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఉనికి కోసం ప్రతిపక్షాల తంటాలు
కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వివక్షకు తావులేకుండా అర్హులందరికీ
జగనన్న ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది
విష్ణు తెలిపారు. అదే చంద్రబాబు హయాంలో వెన్నుపోటులు, కుట్రలు, కుతంత్రాలు
తప్ప.. పేదల కోసం ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టలేకపోయారని విమర్శించారు. కానీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పథకాల ద్వారా పేదల
జీవన స్థితిగతులలో సమూల మార్పులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. శాశ్వత,
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగాల్లో కలిపి మొత్తం 6,16,323 మందికి ప్రభుత్వ
రంగంలో ఉపాధి కల్పించడం ద్వారా నిరుద్యోగ రేటును గణనీయంగా తగ్గించడం
జరిగిందన్నారు. అలాగే అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ
సర్వేను సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర సర్కారు సాకారం చేసి
చూపుతోందన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉనికి కోసం జనసేన పార్టీ తెగ మల్లగుల్లాలు
పడుతోందని మల్లాది విష్ణు అన్నారు. జనాకర్షణ ఉన్న ముఖ్యమంత్రికి కల్పించే
భద్రత ఏర్పాట్లపై కూడా విమర్శలు చేసే స్థాయికి ఆ పార్టీ నాయకులు దిగజారారని
మండిపడ్డారు. ఇకనైనా ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు
మానుకోవాలని.. లేకుంటే ప్రజాక్షేత్రంలోనే మరోసారి గట్టిగా బుద్ధిచెప్పడం
ఖాయమని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ గత
ప్రభుత్వంలో తమకు ఓటు వేసిన వారికే ప్రభుత్వ పథకాలు అందించేవారని.. కానీ నేడు
పార్టీలకతీతంగా ప్రతిఒక్కరికీ పెద్దఎత్తున సంక్షేమం అందుతుండటంతో ప్రజలందరూ
హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా
సుల్తానా మాట్లాడారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సారథ్యంలో సెంట్రల్ లో
పెద్దఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని
తెలిపారు. ప్రతిపక్షాలు కళ్లు తెరిచి చూస్తే నియోజకవర్గంలో జరుగుతున్న
అభివృద్ధి కనబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈ
రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సిడిఓ జగదీశ్వరి, నాయకులు హఫీజుల్లా,
దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నందెపు సురేష్, చింతా శ్రీను, కొండా లక్ష్మి,
నేరెళ్ల శివ, శాంతకుమారి, అమిత్, గల్లెపోగు రాజు, మేడా శ్రీను, మున్షీ,
కొండలరావు, తమ్మిశెట్టి రాజా, చిన్నారావు, నాగేశ్వరరావు, లాయర్ చిన్నా,
జయలక్ష్మి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.