వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : ప్రతి దశలోనూ రైతులు, భూ యజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ రీసర్వే
ద్వారా భూముల రికార్డులు అప్ డేట్ చేసే ప్రక్రియ మరింత జాగ్రత్తగా అమలయ్యేలా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు
ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు. రీసర్వే పూర్తయి తుది
నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా రైతులు, భూ యజమానులు రికార్డుల్లో తమ
వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. .
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నరసాపురంలో సోమవారం శంకుస్థాపన చేసిన ఆక్వా
యూనివర్సిటీ కారణంగా రాష్ట్రం నుంచి మత్స్య ఎగుమతులు మరింతగా పెరుగుతాయని
విజయసాయి రెడ్డి తెలిపారు. భారత దేశ మత్స్య ఎగుమతుల్లో 35% ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం నుంచి జరుగుతున్నప్పటికీ యూనివర్సిటీ అందించనున్న సాంకేతిక సహకారంలో
భవిష్యత్ లో మత్స్య ఎగుమతులు 50 శాతం కన్నా మించిపోతాయని అన్నారు. ముఖ్యమంత్రి
యూనివర్సిటీ కోసం ఆమోదం తెలిపిన రూ. 222 కోట్లతో మత్స్య రంగంలో అవసరమైన ఎందరో
నిపుణులను తయారు చేయవచ్చని అన్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్
అవార్డు వరించిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని విజయసాయి
రెడ్డి అన్నారు. ఇండియన్ సినిమా రంగానికి 40 సంవత్సరాలుగా విశేష సేవలందించిన
చిరంజీవికి ఈ అవార్డు ఓ గుర్తింపు అని అన్నారు.