విజయవాడ : రాష్ట్రంలో 970కిపైగా కి.మీ. సుదీర్ఘమైన తీరం ఉన్నా మన మత్స్యకారులు
ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిపోవడాన్ని అభివృద్ధి అనుకోవాలా?
చెరువుల మీద ఆధారపడి చేపలు పట్టుకొనే మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టేలా జీవో
217 జారీ చేయడం పురోగమనం అనుకోవాలా? రాష్ట్రంలో 80 లక్షల మంది మత్స్యకారుల
జీవన స్థితిగతుల మెరుగుదలను విస్మరించిన పాలకులను కచ్చితంగా ప్రజాక్షేత్రంలో
నిలదీయాల్సిందేనని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తీరాన్ని, జల
సంపదను నమ్ముకున్న గంగపుత్రుల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని,
రాష్ట్రంలోని ప్రతి మత్స్యకార కుటుంబానికీ నా తరపున జనసేన పక్షాన ప్రపంచ
మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నేటికీ మత్స్యకార
గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. నేను చేసిన పోరాట యాత్ర సందర్భంలోను, జనసేన
పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’లోనూ
మత్స్యకారుల ఈతిబాధలు వెల్లడయ్యాయి. సముద్రంలో వేటకు వెళ్ళి ప్రాణాలు
కోల్పోయిన మత్య్సకారులకు రూ.10 లక్షలు ఇస్తామనే హామీ నేటికీ సక్రమంగా అమలు
కావడం లేదు. నిబంధనల పేరుతో ఆ కుటుంబాలను ఇబ్బందిపెడుతున్నారు. జనసేన పార్టీ
మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదలకు నిపుణులతో ప్రణాళికలు రూపొందిస్తోంది.
మత్య్సకార గ్రామాలలో తాగునీటి కల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు వారికి
విద్య, వైద్య వసతులను సక్రమంగా అందించాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించింది.
అదే విధంగా జీవిత, ఆరోగ్య బీమా కల్పన ప్రతి మత్య్సకార కుటుంబానికీ
ధీమానిస్తుంది. జనసేన పార్టీ మత్య్సకారులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పవన్
కళ్యాణ్ తెలిపారు.